NTV Telugu Site icon

Trimurtulu :ముప్పై ఐదేళ్ళ ‘త్రిమూర్తులు’

Trimurtulu

Trimurtulu

సరిగా ముప్పై ఐదేళ్ళ క్రితం వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ – ముగ్గురూ వర్ధమాన కథానాయకులుగా అలరిస్తున్నారు. వెంకటేశ్ అప్పుడప్పుడే ఆకట్టుకుంటున్నారు; అర్జున్ తనదైన యాక్షన్ తో అలరిస్తున్నారు; ఇక రాజేంద్రప్రసాద్ నవ్వుల పువ్వులు పూయిస్తూ సాగుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే అది తప్పకుండా జనాన్ని ఇట్టే కట్టిపడేసేలా ఉండాలి కదా! అందుకోసం హిందీలో ఘనవిజయం సాధించిన ‘నసీబ్’ను ఎంచుకున్నారు నిర్మాతలు టి.సుబ్బరామిరెడ్డి, పి.శశిభూషణ్. వారి ‘మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కిన తొలి చిత్రం ‘జీవన పోరాటం’ కూడా ‘రోటీ కప్డా ఔర్ మకాన్’ అనే హిందీ సినిమా ఆధారంగా తెరకెక్కినదే! అందులోనూ శోభన్ బాబు, రజనీకాంత్, నరేశ్ నటించి, అదీ మల్టీస్టారర్ గానే నిలచింది. ఆ స్థాయిలో కాకపోయినా, ‘త్రిమూర్తులు’ కూడా అప్పటి యంగ్ జనరేషన్ మల్టీస్టారర్ అనుకోవాలి. ఈ సినిమాలో నాటి మేటి హీరోలయిన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ కూడా ఓ పాటలో కనిపించడం విశేషం! 1987 జూన్ 24న ‘త్రిమూర్తులు’ చిత్రం విడుదలయింది.

ఇంతకూ ఈ సినిమా కథ ఏమిటంటే- రామ్మూర్తి, దామోదరం, కోటయ్య, భద్రయ్య – నలుగురు మిత్రులు. ఓ హోటల్ లో బిల్ కట్టలేని తాగుబోతు తన వద్ద నాలుగు రూపాయల లాటరీ టిక్కెట్ ఉందని,దానిని కొని, బిల్లు కట్టమంటాడు. ఈ నలుగురు మిత్రులు ఆ లాటరీ టిక్కెట్ కొంటారు. ఆ టిక్కెట్ కే లక్షల రూపాయలు లాటరీ తగులుతుంది. దాంతో టిక్కెట్ ఉన్న భద్రయ్యను చంపేసి, ఆ నేరాన్ని రామ్మూర్తిపైకి నెడతారు. దామోదరం, కోటయ్య. రామ్మూర్తి కూడా చనిపోయాడని భావిస్తారు. రామ్మూర్తి, భద్రయ్య కుటుంబాలు చెల్లా చెదురవుతాయి. రామ్మూర్తి పెద్ద కొడుకు రాజా, దామోదరం కొడుకు శివ మంచి స్నేహితులు. లాటరీ డబ్బుతో లక్షాధికారి అయిన దామోదరం తన కొడుకు శివను పై చదువులకు విదేశాలకు పంపిస్తాడు. రామ్మూర్తి కొడుకు రాజా ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తుంటాడు. భద్రయ్య కూతురు లత అంటే రాజాకు, శివకు ఇద్దరికీ ఇష్టం. మిత్రుని కోసం తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటాడు రాజా. అయితే, శివకు ఆ విషయం తెలిసి, జూలిని ప్రేమిస్తాడు. రాజా తమ్ముడు సందీప్ లత చెల్లెలు రాణిని ఆరాధిస్తాడు. రాణి తల్లికి విషయం తెలిసి, అతను రామ్మూర్తి కొడుకు అని, అతని తండ్రే మీ నాన్నను చంపాడని చెప్పి వారి ప్రేమను అంగీకరించదు.

రామ్మూర్తిని ఓ డాన్ కాపాడి, తనతో హాంగ్ కాంగ్ తీసుకువెళ్ళి ఉంటాడు. ఆ డాన్ తో దోస్తీ చేసి, అతడినే మోసం చేస్తారు కోటయ్య, దామోదరం. దాంతో వారిపై పగ తీర్చుకోవడానికి రామ్మూర్తిని పంపిస్తాడు డాన్. అతను దామోదరం తనయుడు శివను, కోటయ్య కొడుకు అశోక్ ను కిడ్నాప్ చేస్తాడు. అతడిని చేజ్ చేస్తూ వెళ్ళిన రాజాకు, రామ్మూర్తి తన తండ్రే అని తెలుస్తుంది. అందరికీ అసలు జరిగిన సంగతి ఏంటో రామ్మూర్తి ద్వారా బోధపడుతుంది. దామోదరం, కోటయ్య మధ్య కూడా వైరం పెరుగుతుంది. రామ్మూర్తిని మట్టుపెట్టాలనుకుంటారు. చివరకు రాజా, శివ, సందీప్ కలసి దోషులను అంతమొందిస్తారు. ఎవరికి వారు తాము నచ్చిన అమ్మాయిలను పెళ్ళాడతారు. ఒకప్పుడు డబ్బులు లేక తన లాటరీ టిక్కెట్ నలుగురు మిత్రులకు అమ్మేసిన తాగుబోతు మళ్ళీ తారసపడతాడు. డబ్బుల్లేవు, లాటరీ టిక్కెట్ ఇస్తానని అంటాడు. రామ్మూర్తి వచ్చి, అతనికి తానెవరో చెబుతాడు. అతను ఎప్పుడు వచ్చినా, అన్నీ ఫ్రీగా ఇవ్వమని చెబుతాడు. అతనితో కలసి మూడు జంటలూ చిందులు వేస్తూ ఉండగా కథ ముగుస్తుంది.

వెంకటేశ్ కు జోడీగా శోభన, అర్జున్ జంటగా ఖుష్బూ, రాజేంద్రప్రసాద్ సరసన అశ్వినీ నటించిన ఈ చిత్రంలో రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, సుధాకర్, బాబ్ క్రిస్టో, బాలాజీ, మాడా, నగేశ్, చిట్టిబాబు, సుమిత్ర, కె.విజయ తదితరులు నటించారు. ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాతో తొలిసారి తెలుగుతెరపై కనిపించారు. ఈ చిత్రానికి బప్పిలహిరి సంగీతం సమకూర్చగా, వేటూరి, ఆచార్య ఆత్రేయ పాటలు పలికించారు.

ఈ సినిమా సమర్పకుడు టి.సుబ్బరామిరెడ్డికి చిత్రసీమలో అందరు టాప్ స్టార్స్ తో ఉన్న పరిచయం కారణంగా నాటి మేటి స్టార్ హీరోస్ తో పాటు, ఆ నాటి అందాల భామలు, విజయశాంతి, రాధ, భానుప్రియ, రాధిక, ఖుష్బూ వంటివారు కూడా ఈ సినిమాలో “ఒకే మాట… ఒకే బాట…” అనే పాటలో తళుక్కుమన్నారు. అలా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఒకేసారి తెరపై కనిపించిన ఏకైక చిత్రంగా ‘త్రిమూర్తులు’ నిలచిపోయింది. అదే పాటలో చంద్రమోహన్, మురళీమోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, ఎ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, విజయనిర్మల, శారద, జయమాలిని, అనురాధ, వై.విజయ కూడా కనిపిస్తారు. తమ అభిమాన తారలు తెరపై ఒకే చోట కనిపించడం చూడడం కోసం జనం మొదటి వారం భలేగా ‘త్రిమూర్తులు’కు పరుగులు తీశారు. దాంతో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ చూసింది.