Site icon NTV Telugu

Balakrishna : 35 ఏళ్ళ క్రితం మురిపించిన ‘ప్రెసిడెంట్ గారి అబ్బాయి’

Pred

Pred

యన్టీఆర్, ఏయన్నార్ బాక్సాఫీస్ బరిలో ఢీ అంటే ఢీ అని పోటీ పడ్డా, నిజజీవితంలో సోదరభావంతోనే సాగారు. వారి మధ్య పొరపొచ్చాలు తలెత్తినా, అవి టీ కప్పులో తుఫానులాంటివే. వారి అనుబంధానికి నిదర్శనంగా పలు అంశాలు జనం ముందు నిలుస్తాయి. ఒకప్పుడు యన్టీఆర్ కు అంటూ కొందరు, ఏయన్నార్ కు మరికొందరు ప్రత్యేక నిర్మాతలు ఉండేవారు. వాళ్ళు తమ హీరోలతోనో, లేదా తరువాతి తరం హీరోలతోనో సినిమాలు తీసేవారు తప్పితే, ఆయన నిర్మాత ఈయనతో, ఈయన నిర్మాత ఆయనతో సినిమాలు నిర్మించలేదు. ముఖ్యంగా ఏయన్నార్ నిర్మాతలుగా పేరొందిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఏ.వి.సుబ్బారావు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఆ కోవకు చెందినవారే. యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతో ఏయన్నార్ నిర్మాత, ఆయనకు సమీప బంధువు అయిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏ.వి.సుబ్బారావు సినిమా నిర్మించడం విశేషం! తాతినేని రామారావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం ‘ప్రెసిడెంట్ గారి అబ్బాయి’. 1987 మే 14న ‘ప్రెసిడెంట్ గారి అబ్బాయి’ జనం ముందు నిలచింది. ప్రేక్షకుల మనసు గెలిచింది. ఈ సినిమా విజయం తరువాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ లో బాలకృష్ణ హీరోగా ‘తల్లిదండ్రులు’ కూడా తెరకెక్కి జనాన్ని అలరించింది.

‘ప్రెసిడెంట్ గారి అబ్బాయి’ కథ ఏమిటంటే – పాతికేళ్ళుగా ఓ గ్రామంలో ప్రెసిడెంట్ పదవిలో ఉంటాడు చంద్రయ్య. ఆయనను ఎలాగైనా ఓడించి, ప్రెసిడెంట్ కావాలని తపిస్తుంటాడు ఆయన వియ్యంకుడు సూరయ్య. చంద్రయ్యకు ముగ్గురు కొడుకులు – శివరామ్, ప్రసాద్, రామకృష్ణ. ప్రసాద్ భార్య సత్య తండ్రే సూరయ్య. ఊరంతా చంద్రయ్యను, ఆయన కుటుంబాన్ని గౌరవిస్తుంటారు. చంద్రయ్య కంటే డబ్బులో అధికుడైన సూరయ్య, ఆయన కొడుకు జనానికి అయిష్టంగా ఉంటారు. సూరయ్య చిన్నకూతురు లత తండ్రిలాగే టెక్కున్న పిల్ల. ఓ సారి రామకృష్ణతో తగువులాడిన లత ఎలాగైనా అతణ్ణి అందరి ముందు నవ్వుల పాలు చేయాలని ఆశించి, పలు నాటకాలు ఆడుతుంది. చివరకు రామకృష్ణ మంచి మనసు తెలిసి అతణ్ణి ప్రేమిస్తుంది. అది సూరయ్యకు నచ్చదు. దాంతో రామకృష్ణను పెళ్ళాడాలని భావిస్తుంది. చంద్రయ్య పెద్దకొడుకులు ఇద్దరూ మామ పక్షం చేరతారు. లతకు వేరే వ్యక్తితో పెళ్ళి జరిపించాలని చూస్తారు. రామకృష్ణ వెళ్ళి లతను పెళ్ళి చేసుకు వస్తాడు.

చంద్రయ్య కుటుంబం ముక్కలు అవుతుంది. చంద్రయ్య పెద్దబ్బాయి శివరామ్ కొడుకు గోపిని రామకృష్ణ ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు. బాబాయ్ అంటే ప్రాణం పెట్టే గోపి, బాబాయ్ కోసమని రాత్రి వెళతాడు. ఆ బాబును సూరయ్య మనుషులు చంపేస్తారు. ఆ నేరం రామకృష్ణపై నెట్టేస్తారు. కానీ, రాత్రిపూట గోపిని చంపడం తన కళ్ళారా చూశానని ఆ ఊరి డబ్బు కొట్టేవాడు చెప్పడంతో ఊరి వారంతా సూరయ్యను, అతని అనుచరులను చితక బాదుతారు. చంద్రయ్యనే అడ్డుపడి విడిపిస్తాడు. సూరయ్యను, అతని అనుచరులను పోలీసులు పట్టుకుపోతారు. మళ్ళీ చంద్రయ్య కుటుంబం ఒక్కటి కావడంతో కథ ముగుస్తుంది.

బాలకృష్ణ సరసన సుహాసిని నాయికగా నటించిన ఈ చిత్రంలో జగ్గయ్య, సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, రాజేశ్, రాజ్ వర్మ, పరుచూరి వెంకటేశ్వరరావు, సుధాకర్, ఈశ్వరరావు, సాక్షి రంగారావు, పి.యల్.నారాయణ, రామ్జీ, రమణారెడ్డి, అన్నపూర్ణ, నిర్మలమ్మ, రాజ్యలక్ష్మి, వై.విజయ, వరలక్ష్మి, కుయిలి, మాస్టర్ రాజేశ్ అభినయించారు. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్, పాటలు వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. నందమూరి మోహనకృష్ణ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫిగా వ్యవహరించారు. ఇందులోని “చెక్కం చెక్కం చెక్కా…”, “ఎగిరింది ఎగిరింది తెలుగింటి జెండా…”, “సిత్రాంగి పిలిచింది సారంగుడో…”, “యాడనుండి వస్తే నీకెందుకు…”, “ముద్దు పెట్టమంటే…” అంటూ సాగే పాటలు అలరించాయి.

బాలకృష్ణ 1987లో నటించిన హిట్ మూవీస్ లో ‘ప్రెసిడెంట్ గారి అబ్బాయ’ కూడా ఒకటిగా నిలచింది. ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. వందరోజుల వేడుకలో బాలకృష్ణకు గజారోహణ చేసి ఊరేగించడం అప్పట్లో విశేషంగా చెప్పుకున్నారు. ఈ సినిమాను చూస్తే, యన్టీఆర్ నటించిన ‘కలసివుంటే కలదు సుఖం, ఉమ్మడి కుటుంబం’ వంటి చిత్రాలు గుర్తుకు రాకమానవు.

Exit mobile version