NTV Telugu Site icon

The Warrior Trailer: పోలీస్ కమ్ డాక్టర్.. ‘వారియర్’ ఎవరు..?

The Warrior

The Warrior

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తమిళ్ భాషల్లో జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో రామ్ అదరగొట్టేశాడని చెప్పాలి. కర్నూల్ కు కొత్తగా వచ్చిన డీఎస్పీ సత్య. అతనికి డ్యూటీ అంటే పిచ్చి.. ఒంటిమీద యూనిఫార్మ్ లేకపోయినా 24 గంటలూ డ్యూటీలోనే ఉంటాడు. ఇక అలాంటి పవర్ ఫుల్ పోలీస్ కు రేడియో జాకీగా పనిచేసే మహాలక్ష్మీ పరిచయమవుతోంది. ఈ నేపథ్యంలోనే కర్నూల్ ను ఒంటి చేత్తో శాసించే గురుకు డీఎస్పీ సత్య ఆటంకం కలిగిస్తాడు.

ఇక ఒక క్రూరమైన విలన్ కు ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ కు జరిగే యుద్ధమే మిగతా కథగా తెలుస్తోంది.పవర్ ఫుల్ పోలీసాఫీసర్ లుక్ లో రామ్ ఒదిగిపోగా క్రూరమైన విలన్ గా ఆది జీవించేసాడు. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఊర మాస్ డైలాగ్స్, రామ్ అదిరిపోయే మేకోవర్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. ఇక చివర్లో డాక్టర్ అవతారంలో కనిపించి ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతకీ పోలీస్ ఎవరు..? డాక్టర్ ఎవరు..? రామ్ డబుల్ రోల్ లో కనిపిస్తున్నాడా..? అనేది మిస్టరీగా వదిలేశారు. సినిమా మొత్తం కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో తీసినట్లు లొకేషన్స్ చూస్తుంటే తెలుస్తోంది. పోలీస్ దొంగల కథలు చాలా వచ్చినా లింగుసామి ఇందులో ఏదో కొత్త అంశాన్ని జోడించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ తో భారీ అంచనాలను పెంచేశారు.. మరి ఈసారి రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.