NTV Telugu Site icon

Achanta Gopinath: మరోసారి ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో!

Rana

Rana

Rana: ‘లీడర్’, ‘కృష్ణంవందే జగద్గురుమ్’ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి… ‘బాహుబలి’, ‘ఘాజీ’ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ దర్శకత్వంలో రానా నటించిన పొలిటికల్ డ్రామా ‘నేనే రాజు నేనే మంత్రి’ నటుడిగా అతనిలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆరేళ్ళ తర్వాత ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. రానా కథానాయకుడిగా పాన్ ఇండియా మూవీని విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన చాలా కాలం క్రితమే వచ్చింది. అయితే… ఇప్పుడీ సినిమాకు తేజ డైరెక్షన్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి హిట్ సినిమా రూపొందించిన తేజ, రానా తమ్ముడు అభిరామ్ ను ‘అహింస’ అనే సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాడు. జెమినీ కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న జనం ముందుకు రాబోతోంది. ఇప్పుడు మరోసారి రానా – తేజ కాంబో రిపీట్ కాబోతుండటం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

నిర్మాత ఆచంట గోపీనాథ్ విషయానికి వస్తే, నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ సినిమాలను ఆయన నిర్మించారు. నయనతార ప్రధాన పాత్ర పోషించిన తమిళ హిట్ ‘ఇమైక్క నొడిగల్’ను తెలుగులో ‘అంజలి సిబిఐ’గా విడుదల చేశారు. కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి, తేజ కాంబినేషన్ లో ఆయన పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు. ఇందులో ఓ మలయాళ స్టార్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నారని, ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని గోపీనాథ్ తెలిపారు.