Site icon NTV Telugu

‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’ వినోదం పంచుతున్న ట్రైలర్!

‘పెళ్ళిగోల’ ఫేమ్ మల్లిక్ రామ్ రూపొందించిన తాజా వెబ్ సీరిస్ ‘తరగతి గది దాటి’. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో నిర్మితమైన ఈ వెబ్ సీరిస్ టీవీఎఫ్ ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’కు రీమేక్. టీనేజ్ రొమాన్స్ ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న దీని ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ ప్రేమకథ సాగుతుంది. దాంతో తెలుగు నేటివిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గోదావ‌రి, దాని చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లోని జీవనాన్ని ఇది తెలియ‌జేస్తోంది. కిట్టు త‌ల్లిదండ్రులైన శంక‌ర్‌, గౌరి ఓ కోచింగ్ సెంట‌ర్‌ను న‌డుపుతుంటారు. కృష్ణ‌కు లెక్క‌లంటే చాలా ఇష్టం. విద్యార్థిగా మంచి తెలివితేటలుంటాయి. కానీ చ‌దువుపై దృష్టి పెట్ట‌డు. వాళ్ల కోచింగ్ సెంట‌ర్‌లో జాస్మిన్ అనే అమ్మాయి జాయిన్ అయిన త‌ర్వాత అత‌ని ప్రపంచం ఎలాంటి మలుపులు తిరుగుతుంద‌నేదే ఈ వెబ్ సీరిస్ క‌థ‌. తాజాగా విడుదలైన ట్రైలర్ లో పంచ్ డైలాగ్స్ తో పాటు టీనేజ్ లవ్ కూ పెద్ద పీట వేశారు. ఈ నెల 20న ఐదు ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సీరిస్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Exit mobile version