టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ తీస్తే అందులో ‘దిల్ రాజు’ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఫ్యామిలీ సినిమాలు, స్టార్ కాంబినేషన్స్, చిన్న సినిమాలు, డిస్ట్రిబ్యుషన్… ఇలా సినిమాకి సంబంధించిన వ్యాపారం చేయడంలో దిల్ రాజు దిట్ట. ప్రస్తుతం దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమా చేస్తున్న దిల్ రాజు, ఆ మూవీ ప్రమోషన్స్ ని ముందుండి నడిపిస్తున్నాడు. ఈరోజు దిల్ రాజు పుట్టిన రోజు సంధర్భంగా తమిళనాడులో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అజిత్ కన్నా విజయ్ నంబర్ 1 హీరో అనడం, థియేటర్స్ విషయంలో గట్టిగా నిలబడడం లాంటి కారణాలు దిల్ రాజుని తమిళనాడులో ఓవర్ నైట్ స్టార్ ప్రొడ్యూసర్ ని చేశాయి. అక్కడి విజయ్ ఫాన్స్, దిల్ రాజుకి పుట్టిన రోజు విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. #Varisu హాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి ఇప్పటివరకూ రెండున్నర లక్షల ట్వీట్స్ వేశారు విజయ్ ఫాన్స్.
దిల్ రాజు తెలుగులో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు, ప్రతి హీరో కెరీర్ లో గుర్తుండి పోయే సినిమాలని ఇచ్చాడు. ఎన్ని హిట్స్ ఇచ్చినా తెలుగులో దిల్ రాజు పుట్టిన రోజుకి ఈ రేంజ్ సెలబ్రేషన్స్ జరగలేదు. అలాంటిది తమిళనాడులో ఒక్క సినిమాకే, దిల్ రాజుకి ఈ రేంజ్ లో వెల్కం చెప్తున్నారు అంటే విజయ్ ఫాన్స్ దిల్ రాజుని ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే విజయ్ తమిళనాడులో స్టార్ హీరో కాబట్టి కొంచెం ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలి అని అడుగుతున్న దిల్ రాజు, అదే లాజిక్ ని తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్తించేలా చేస్తే బాగుంటుంది. ఇక్కడ స్టార్ హీరోలైన బాలయ్య, చిరులకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలి అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విమర్శలకి దిల్ రాజు ఎలా స్పందిస్తాడో చూడాలి.