Site icon NTV Telugu

OTT Effect: ఓటీటీ నా మజాకా!?

Ott Platforms

Ott Platforms

తెలుగు సినిమా నిర్మాతల మండలి ఇటీవల సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే షరతు విధించింది. అయితే విడుదలైన సినిమాల ఫలితంతో అన్నీ తలక్రిందులు అవుతున్నాయి. దాంతో ఏ సినిమా కైనా డిజిటల్ రిలీజ్ అనేది ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ నిర్ణయాలపై ఆధారపడి ఉంటోంది. ఈ విషయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నిర్ణయమే సుప్రీమ్ అని ఇటీవల డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో విడుదలైన సినిమాలను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.

అల్లు అర్జున్ ‘పుష్ప’ నుంచి తాజాగా విడుదల అవుతున్న కమల్ హాసన్ ‘పుష్ప’ వరకూ ఓటీటీ నిర్ణయమే శిరోధార్యమని తేలింది. డిసెంబర్ 17, 2021లో విడుదలై విజయం సాధించిన ఐకాన్ స్టార్ బన్నీ ‘పుష్ప’ నెలలోపుగానే ఓటీటీలో ప్రత్యక్షం అయింది. ఇక బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కెజిఎఫ్2’ 48 రోజుల్లో డిజిటల్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రిన్స్ మహేశ్ నటించిన ‘సర్కారు వారి పాట’ 40 రోజులు కాకముందే ఓటీటీలో చూడండి అంటూ మురపించింది. ఇద్దరు స్టార్ హీరోలతో అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా పట్టుమని 46 రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ పై దర్శనం ఇచ్చి సత్తా చాటుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించి ‘ఆచార్య’ అయితే 20 రోజులకే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. నాని నటించిన ‘అంటే సుందరానికి’ 30 రోజుల్లో, అడవిశేష్ ప్రతిష్టాత్మకం అని చాటుకుంటున్న ‘మేజర్’ సైతం 30డేస్ లో ఓటీటీ ప్రదర్శనకు సిద్ధం అయిపోయాయి.

మాజీ లవర్‌పై సారా, జాన్వీ సెటైర్

కమల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఇప్పటికీ మంచి షేర్స్ తో రన్ అవుతున్న ‘విక్రమ్’ సినిమా ఆశ్చర్యకరంగా 35 రోజుల్లోనే ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైపోయింది. మిగతా సినిమాలంటే థియేటర్లలో నిల్ షేర్ తో ఓటీటీలో ప్రత్యక్షం అయ్యాయనుకుంటే ‘విక్రమ్’ మాత్రం అందుకు భిన్నంగా మంచి షేర్ వస్తున్న టైమ్ లోనే ఓటీటీలోకి వస్తోంది. ఇది ఓ రకంగా పంపిణీదారులకు శరాఘాతమే. దీనిని బట్టి నిర్మాతలమండలి, ఫిలిమ్ ఛాంబర్ కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పవర్ ఫుల్ అని అర్థం అవుతోంది. దీనిపై నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.

Exit mobile version