Site icon NTV Telugu

IFFI: ఇఫీలో తెలుగు సినిమాలకు పెద్ద పీట!

Iffi

Iffi

IFFI: ఈ నెల 20 నుండి 28 వరకూ గోవాలో 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం జరుగబోతోంది. గతంతో పోల్చితే ఈసారి తెలుగు సినిమాలకు ఈ చిత్రోత్సవంలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ఇండియన్ పనోరమా విభాగంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీతో పాటు నట సింహం నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను రూపొందించిన ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. అలానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ‘సినిమా బండి’ సైతం ఇండియన్ పరోరమాకు ఎంపికైంది. ఇక విద్యాసాగర్ రాజు రూపొందించిన ‘ఖుదీరామ్ బోస్’ చిత్రమూ ఇండియన్ పనోరమాలో చోటు దక్కించుకుంది. ఇంకో విశేషం ఏమంటే… తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న అడివి శేష్ ‘మేజర్’సినిమా హిందీ వర్షన్ ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. అలానే ప్రముఖ తెలుగు నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం ‘కీడా’కూ ఇందులో చోటు దక్కింది. అలానే మరో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ హిందీ నుండి ఇండియన్ పనోరమాకు ఎంపికై ప్రదర్శితం కాబోతోంది.

ఇతర విభాగాల విషయానికి వస్తే… ఇండియన్ రెస్టోర్డ్ క్లాసిక్స్ విభాగంలో ఈసారి ఐదు చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా ‘శంకరాభరణం’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. అలానే ఇటీవల కన్నుమూసిన సినీ ప్రముఖులను స్మరించుకుంటూ, వారికి నివాళిగానూ కొన్ని సినిమాలను ప్రదర్శించడానికి ఈ చిత్రోత్సవంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కేటగిరిలో ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు తెరకెక్కించిన ‘జీవన తరంగాలు’ చిత్రాన్ని ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఇదే సినిమాను కృష్ణంరాజు జ్ఞాపకార్థం గానూ ప్రదర్శించబోతున్నారు. నిజానికి ఈ సినిమా కృష్ణంరాజు కీలక పాత్ర చేసినా, కథానాయకుడు శోభన్ బాబు. కాబట్టి…. కృష్ణంరాజు కు నివాళిగా ఆయన హీరోగా నటించిన మరేదైనా సినిమాను కమిటీ సభ్యులు ఎంపిక చేసి ఉంటే సబబుగా ఉండేది. మరి ఈ విషయంలో నిర్వాహకులు పునరాలోచన చేస్తారేమో చూడాలి. ఈసారి ఇండియన్ పనోరమా చిత్రాల ఎంపిక కమిటీలో ఇద్దరు తెలుగు దర్శకులకు చోటు దక్కింది. అందులో ఒకరు వి.ఎన్. ఆదిత్య కాగా, మరొకరు ప్రేమ్ రాజ్! మొత్తం మీద తొమ్మిది రోజుల పాటు గోవాలో జరిగే ఈ చిత్రోత్సవంలో తెలుగు సందడి బాగానే కనిపించే ఆస్కారం ఉంది.

Exit mobile version