తెలుగు ఇండియన్ ఐడిల్ వీక్షకులకు ఒక రోజు ముందే ఉగాది వచ్చేసింది. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ కు అయితే శుక్రవారం స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ డబుల్ ధమాకాను ఇచ్చింది. ఉగాది స్పెషల్ గా రూపుదిద్దుకున్న ఈ ఎపిసోడ్ లో శుక్రవారం కంటెస్టెంట్స్ ఐదుగురు నందమూరి బాలకృష్ణ సినిమా పాటలు పాడగా, ఒకరు నటరత్న ఎన్టీయార్ మూవీ పాట పాడారు. దాంతో నందమూరి అభిమానులకు ఈ ఎపిసోడ్ పండగే పండగ అన్నట్టుగా మారిపోయింది.
శుక్రవారం టెలికాస్ట్ అయిన తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్ ను న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ తో పాటు శ్రీరామచంద్ర, 12 మంది కంటెస్టెంట్స్ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, పాటతో ప్రారంభించారు. ఈ ఎపిసోడ్ నుండి సింగర్స్ కు జడ్జీలు పాయింట్స్ వేయడంతో పాటు వీక్షకుల నుండి వచ్చే ఓటింగ్స్ నూ పరిగణనలోకి తీసుకుంటారు. తక్కువ పాయింట్లు, ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేసేస్తారు. సో… మరింత ఏకాగ్రతతో పాటలు పాడాలని తమన్ కంటెస్టెంట్స్ ను కోరారు. మొదటగా శుక్రవారం లాలస ‘సమరసింహారెడ్డి’లోని ‘రావయ్యా ముద్దుల మావ’ పాటతో ఆకట్టుకుంది. ఆమె పెర్ఫార్మెన్స్ కు జడ్జీలు బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ అభినందించారు. అలానే ఉగాది పండగను పురస్కరించుకుని లాలస మదర్ ఉగాది పచ్చడి తీసుకొచ్చి… అందరికీ పెట్టారు. ఎప్పుడూ తన కూతురును మెచ్చుకోని ఆమె తొలిసారి వేదికపై లాసన ను అప్రిషియేట్ చేయడంతో ఆమె కళ్ళ నుండి ఆనందభాష్పాలు రాలాలి.
Read Also : Tiger Nageswara Rao : వేట మొదలైంది… స్టన్నింగ్ ప్రీ లుక్
‘ఖల్ నాయక్’ నిత్యామీనన్!
ఆ తర్వాత ప్రణతి ‘అఖండ’ మూవీలోని ‘హొయ్యా హొయ్యా ముద్దుల మావయ్యా…’ గీతాన్ని ఆలపించింది. విశేషం ఏమంటే తమన్ స్వరపరిచిన ఈ పాటను సినిమాలో తన తోటి సింగర్స్ తో కలిసి అదితి భావరాజు పాడింది. ఇక్కడ ఈ స్టేజ్ మీద ప్రణతి పాడుతుంటే… అదితి కోరస్ అందించింది. ఈ విషయాన్ని గ్రహించిన నిత్యామీనన్ అదితిని అభినందించింది. తన జీవితంలోనూ ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని ఈ సందర్భంగా సింగర్ కార్తీక్ గుర్తు చేసుకున్నాడు. మలేషియాలో బాలుగారు పాడిన పాటను ఆయన సమక్షంలోనే తాను మ్యూజిక్ కన్సర్ట్ లో పాడుతుంటే… ఆయన స్టేజ్ పైకి వచ్చి కోరస్ ఇచ్చారని కార్తీక్ తెలిపాడు. కాంపిటీషన్ మొదలయ్యే ముందు ప్రణతి ‘భీమ్లా నాయక్’లో నిత్యామీనన్ సంభాషణలను ప్రాక్టీస్ చేస్తూ తనకు కనిపించిందని శ్రీరామ్ చంద్ర చెప్పాడు. దాంతో ఆమె ఆ సినిమాలోని నిత్యామీనన్ డైలాగ్స్ ను చెప్పింది. ‘ఈ సినిమాలో తనను పవన్ కళ్యాణ్ కాఫీ అడగగానే ‘బయటకు పోయి తాగు’ అంటూ చెప్పిన డైలాగ్ ఇష్టమని, అది స్క్రిప్ట్ లో లేకపోయినా స్పాంటేనియస్ గా చెప్పాన’ని నిత్యామీనన్ తెలిపింది. పవన్ ‘నాయక్’ అయితే… నిత్యా మీనన్ ‘ఖల్ నాయక్’ అంటూ తమన్ సరదాగా ఆటపట్టించాడు. ఆమె ‘కళ్ళతో నటించే నాయక్’ అంటూ శ్రీరామ్ చంద్ర ఆ మాటను సవరించాడు. దాంతో ‘ఒరేయ్ భజన చేయడం ఆపరా’ అంటూ తమన్ నవ్వుతూ సెటర్ వేశాడు.
మూడో కంటెస్టెంట్ మారుతి ‘నరసింహనాయుడు’ మూవీలోని ‘కొ క్కొ క్కోమలి’ పాటను పాడి ఆకట్టుకున్నాడు. మారుతీ డ్రెస్ ను తమన్ మెచ్చుకుంటూ ‘నీదీ నాది ఒకేలాంటి డ్రస్. సాయంత్రం ఎవరైనా మ్యారేజ్ పార్టీ వాళ్ళు ఐదొందలు బేటా ఇస్తానంటే వెళ్ళి షెహనాయ్ వాయించి వద్దాం’ అంటూ జోక్ చేశాడు. ఇక నెల్లూరు సింగర్ వాగ్దేవి కళ్ళ జోడు నుండి కాంటాక్ట్ లెన్స్ లోకి మారిపోయింది. ఆమె ‘ఆదిత్య 369’లోని సంగీత ప్రధాన గీతాన్ని అద్భుతంగా పాడేయడంతో ‘బొమ్మ బ్లాక్ బస్టర్ ఫెర్ఫామెన్స్’ అంటూ జడ్జీలు మెచ్చుకున్నారు. పాట పాడిన తర్వాత వాగ్దేవి ఇచ్చిన పొడుపుకధను కార్తీక్, తమన్ విప్పలేకపోయారు. అందులో నిత్యామీనన్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత పంజాబ్ కు చెందిన జస్కరన్ సీనియర్ ఎన్టీయార్ మూవీ ‘భలే తమ్ముడు’ లో మహ్మద్ రఫీ పాడిన ‘ఎంతవారు గానీ’ సాంగ్ పాడాడు. తెలుగు భాష నేర్చుకుని పాటలు పాడుతున్న జస్కరన్ ను అందరూ అభినందించారు. తమన్ ’30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా?’ అనే పుస్తకాన్ని అతనికి ప్రెజెంట్ చేశాడు. 20 రోజుల్లోనే తను తెలుగు నేర్చుకుంటానని జస్కరన్ చెప్పడం విశేషం. ఇక ఈ ఎపిసోడ్ లో చివరగా సింగర్ అదితీ భావరాజు ‘ధర్మక్షేత్రం’లోని ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ…’ పాట పాడి అలరించింది. ఆ పాటలో వచ్చే ‘పెదవి కొరికే… పెదవి కొరకే..’ అనే పదాల గురించి శ్రీరామ్ చంద్ర, తమన్ కాసేపు చర్చ చేశారు. అనంతరం ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కోసం డ్రసెస్ అండ్ జ్యూయలరీ సెలక్షన్ చేసుకోవడానికి కంటెస్టెంట్స్ చందనా బ్రదర్స్ కు వెళ్ళినప్పటి వీడియోను సరదాగా ప్లే చేశారు. మొత్తానికి బాలయ్య బాబు పాటలతో శుక్రవారం ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా సాగింది. ఇక ఫస్ట్ ఎలిమినేషన్ శనివారం జరుగబోతోంది.
