మ్యూజిక్ లో తమన్ బ్లాక్ బస్టర్! సింగింగ్ లో కార్తిక్ బ్లాక్ బస్టర్!! యాక్టింగ్ లో నిత్యామీనన్ బ్లాక్ బస్టర్!!! సో… ఈ ముగ్గురి మూవీస్ కు సంబంధించిన పాటలతో ఈ వీకెండ్ తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్ సాగింది. గతంలో కంటే మరింత ఫన్ గా, కాస్తంత డిఫరెంట్ గా ఈ ఎపిసోడ్ ను మొదలు పెట్టారు. పార్టిసిపెంట్ జయంత్… శ్రీరామచంద్ర స్థానంలోకి హోస్ట్ గా వచ్చే సరికీ జడ్జీలు కాస్తంత కంగారు పడ్డారు. అయితే… తనకు కట్టేసిన కట్లు విప్పుకుని, రౌడీలను తప్పించుకుని వచ్చానంటూ శ్రీరామ్ లేట్ గా ఎంట్రీ ఇచ్చి చెప్పాడు. ఇక ఎప్పటిలానే తనదైన శైలిలో తమన్, కార్తీక్, నిత్యా మీనన్ మీద తవికలు పాడి ఎపిసోడ్ ను పట్టాలెక్కించాడు.
ఈ శుక్రవారం మొదటగా లాలస ‘క్రాక్’ మూవీలోని ‘భూమ్ బద్దల్’ ఐటమ్ సాంగ్ పాడి అందరినీ ఆకట్టుకుంది. నిత్యామీనన్ అయితే లాలసకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసింది. అంతేకాదు…. ముగ్గురు జడ్జెస్ ‘బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అంటూ అభినందించారు. ఆ తర్వాత వచ్చిన రేణు కుమార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ నుండి ఇటీవల వచ్చి బ్లాక్ బస్టర్ సాంగ్ ‘కమ్మా.. కమ్మా…. కళావతి’ ని పాడి అలరించాడు. ఆ తర్వాత తమన్ ను స్టేజ్ మీదకు పిలిచి ఆ పాటకు తనతో పాటు స్టెప్పులేయాల్సిందిగా రేణు కోరాడు. అంతకు ముందు శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసిన తమన్, ఈ సారి కార్తీక్ ను కూడా తోడుగా స్టేజ్ మీదకు పిలిచించుకున్నాడు. అలానే జయంత్ నూ రమ్మని చెప్పాడు. వీరంతా కలిసి ఆ పాటకు సరదాగా స్టెప్పులేశారు. తానొక్కడినే డాన్స్ చేస్తే ట్రోల్ చేస్తారనే భయంతో ఇలా తోడుగా కొందరిని పక్కన పెట్టుకుంటానని తమన్ రహస్యం చెప్పేశాడు.
ఇక అదితి భావరాజు ‘ఓకే బంగారం’ మూవీలోని ‘చిన్ని చిన్ని సంగతులే’ పాటను అద్భుతంగా పాడి బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అని అనిపించుకుంది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో జయంత్ ఎక్కువ అబద్ధాలు చెబుతాడంటూ కాలేజీ పేరు చెప్పి, అతను ‘భీమ్లా నాయక్’ మూవీ చూసేశాడని తమన్ కు కంప్లయింట్ ఇచ్చింది అదితి. అతను చెప్పిన మాటలు నమ్మిన వారిదే తప్పు అని అతనిది కాదంటూ తమన్ జయంత్ ను వెనకేసుకొచ్చాడు. పైగా తమలాగా లావుగా ఉండేవాళ్ళు పరిగెత్తలేరు, దాక్కోలేరని, అందుకే ఎప్పుడూ నిజాయితీగా ఉంటారని తమన్ జయంత్ తరఫున వకాల్తా కూడా పుచ్చుకున్నాడు.
ఆ తర్వాత ‘రేసుగుర్రం’ టైటిల్ సాంగ్ పాడిన ప్రణతి సైతం ‘బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అనిపించుకుంది. మారుతి ‘బాయ్స్’ మూవీలోని ‘నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి’ పాటను పాడి అందరినీ మెప్ఫించాడు. ఈ పాటను ఒరిజినల్ గా పాడిన కార్తీక్ తో కలిసి పాడాలన్నది తన కోరిక అని చెప్పగానే అందుకు అంగీకరించిన కార్తీక్ స్టేజ్ మీదకు వెళ్ళి పాడాడు. అంతేకాదు… అద్భుతంగా పాడావంటూ మారుతీకి లడ్డూ కూడా తినిపించాడు. తమన్, కార్తీక్ ఇద్దరూ కలిసి ఈ పాటకు డాన్స్ చేశారు. ఆ తర్వాత ఈ షోకు శుక్రవారం విడుదలైన ‘గని’ మూవీ హీరో వరుణ్ తేజ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఎపిసోడ్ లో చివరగా మాన్య ‘సరైనోడు’ మూవీలోని ‘రంగు రంగు సైకిలెక్కి’ పాటను పాడింది. వరుణ్ తేజ్ కు అతని సినిమాల టైటిల్స్ అన్నింటి పేర్లు కలిసి వచ్చేలా మాన్య ప్రపోజ్ చేస్తే… తన గురించి అంత గొప్పగా చెప్పిన ఆమెకే రిటర్న్ రెడ్ రోజ్ ను ఇచ్చాడు వరుణ్. ఎప్పుడూ సంప్రదాయ దుస్తులు ధరించే మాన్య… ఈ పాట కోసం వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం విశేషం. మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో పాటలతో పాటు మోర్ ఫన్ ను తెలుగు ఇండియన్ ఐడిల్ టీమ్ అందించింది.
