తెలుగు ఇండియన్ ఐడిల్ సెకండ్ ఎపిసోడ్ శనివారం స్ట్రీమింగ్ అయ్యింది. మొదటి ఎపిసోడ్ బాటలోనే ఇదీ సాగింది. ఇందులోనూ సంగీతంతో పాటు హాస్యానికి ప్రాధాన్యమించారు. విశేషం ఏమంటే… మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు. యాంకర్ శ్రీరామచంద్ర టోన్ జీన్స్ వేసుకోవడాన్ని చూసి ‘నీ డ్రస్ డిజైనర్ ఎవరు? ఎందుకలా చిరిగిన జీన్స్, షర్ట్స్ నీతో వేయిస్తున్నాడు?’ అంటూ జోక్ చేశాడు. అతనికి డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని, అందుకే వాటిని చింపి ఇస్తున్నాడంటూ శ్రీరామచంద్ర బదులిచ్చాడు.
ఈ సెకండ్ ఎపిసోడ్ నెల్లూరుకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళతో మొదలైంది. నెల్లూరు చేపల పులుసుకు ప్రసిద్ధి అంటూ తమన్ చెప్పడమే కాకుండా…. తనది కూడా ఆ వూరేనంటూ కంటెస్టెంట్స్ లో కాస్తంత కాన్ఫిడెన్స్ ను నింపే ప్రయత్నం చేశాడు. వైష్ణవి ‘వన్ నేనొక్కడినే’ మూవీలోని ‘ఆవ్ తుజొ మోకార్తా’ సాంగ్ పాడింది. ఆ తర్వాత వచ్చిన ఆమె చెల్లి వాగ్దేవి ‘ఆచార్య’ మూవీలోని ‘లాహే లాహే’ గానంతో ఆకట్టుకుంది. ఇద్దరు లేడీ సింగర్స్ వాయస్ నూ తానే తనదైన శైలిలో పాడి తమన్ మనసు గెలుచుకుంది. వాగ్దేవికి తమన్, నిత్యామీనన్, కార్తీక్ ‘యస్’ చెప్పగా, వైష్ణవికి మాత్రం తమన్, కార్తీక్ యస్ చెప్పారు. నిత్యా మీనన్ నో చెప్పింది. మెజారిటీ ఓట్లతో ఆమె కూడా ప్రమోట్ అయ్యింది. వాగ్దేవి వాయిస్ కల్చర్ నచ్చడంతో మణిశర్మకు ఆమెను రికమండ్ చేస్తానని తమన్ మాట ఇచ్చాడు.
Read Also : Prakash Raj : బాక్స్ ఆఫీస్ దగ్గర కక్ష సాధింపులు… ఏమైనా ఉంటే రాజకీయాల్లో…
ఆ తర్వాత వచ్చిన లాలస ‘స్వాతి కిరణం’లోని ‘ఆనతి నీయరా…’ గీతంతో అందరినీ మెస్మరైజ్ చేసింది. అమెరికా నుండి సంగీతం నేర్చుకోవడం కోసమే నాలుగేళ్ళ క్రితం తాను ఇండియా వచ్చానని చెప్పింది లాలస. ప్రముఖ సింగర్ శ్రీరామచంద్రకు ఆమె కజిన్ కావడం విశేషం. ఆమె పాటకు ఫిదా అయిన జడ్జెస్ గ్రాండ్ ఫినాలే అనుభూతి తమకు కలిగిందని చెప్పారు. ఈ ఎపిసోడ్ లో గోల్డెన్ మైక్ ను లాసస సొంతం చేసుకుంది. ఆ తర్వాత మనీష్… ‘ట్రిపుల్ ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను ర్యాప్ స్టైల్ లో పాటడమే కాదు… దానికి తగ్గట్టుగా స్టెప్పులూ వేశాడు. దాంతో న్యాయనిర్ణేతలు తామున్న వేదిక డాన్స్ కాంపిటీషన్ కు సంబంధించిందా అనే అనుమానంలో పడ్డారు. అయితే మనీష్ తపనను గుర్తించిన వీరు అతను కోరుకున్నట్టు సెల్ఫీ దిగి పంపేశారు.
ఈ ఎపిసోడ్ లోనూ జీవితంలో ఎదురీదుతున్న ఓ సింగర్ ను వీక్షకుల ముందుకు నిర్వాహకులు తీసుకొచ్చారు. హోటల్ లో, బార్ లో వెయిటర్ గా పనిచేసే మారుతీ ఎప్పటికైనా సింగర్ కావాలన్నది తన అభిమతమని చెప్పాడు. అతను పాడిన పాటతో ఖుషీ అయిన జడ్జెస్ గోల్డెన్ టిక్కెట్ ఇచ్చారు. ఇక చివరగా బోడా జయంత్ మాధుర్ వచ్చి ‘ఆంధ్రావాలా’లోని ‘నైరే నైరే… ‘పాట అందుకున్నాడు. భారీ కాయాన్ని కూడా పట్టించుకోకుండా బోలెడంత ఎనర్జీతో ఆ పాట పాడాడు. అయితే థమన్ మాత్రం తనకోసం ఓ మంచి మెలోడీ సాంగ్ పాడమని చెప్పడంతో ‘ఉండిపోరాదే…’ గీతాన్ని ఆలపించాడు. అతనికీ న్యాయనిర్ణేతలు యస్ చెప్పారు. ఈ రకంగా ప్రతి ఎపిసోడ్ లోనూ ఒకరికి గోల్డెన్ మైక్, మరొకరికి గోల్డ్ టిక్కెట్… కొందరికి యస్ చెబుతున్నారు తమన్, నిత్యా, కార్తీక్.
మరి వచ్చే వారం ఎవరెవరు తమ అదృష్టం పరీక్షించుకుంటారో, వారిలో ఎవరు ముందుకు వెళతారో చూడాలి.