Site icon NTV Telugu

TFPC: పుకార్లు నమ్మొద్దంటున్న నిర్మాతల మండలి!

Tfpc

Tfpc

 

Telugu Film Producers Council : ప్రస్తుతం తెలుగు సినిమా తీవ్ర సంక్షోభంలో ఉంది. స్టార్ హీరోల సినిమాలకు సైతం ఆదరణ లభించని పరిస్థితి నెలకొంది. కొవిడ్ అనంతరం కొన్ని సినిమాలకు మాత్రమే ప్రేక్షకాదరణ లభించింది. చాలా సినిమాలకు థియేటర్లలో స్పందన కరువు అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ను ఆపివేసి ఓసారి పరిస్థితులను పునః సమీక్షించుకోవడం మంచిదని రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే… కరోనా కష్టాలను అధిగమించి ఇప్పుడిప్పుడే సినిమా రంగం గాడిన పడుతున్న సమయంలో ఇలా షూటింగ్స్ బంద్ చేస్తే అసలుకే ఎసరు పెట్టినట్టు అవుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి సోమవారం మరోసారి సమావేశం కాబోతోంది. అలానే ఈ నెల 26వ తేదీ మంగళవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తన నాలుగు విభాగాల (నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్, స్టూడియో నిర్వాహకులు) తో సమావేశం కానుంది. ఆ సమావేశంలోని అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి, ఓ నిర్ణయానికి రాబోతోంది. అప్పటి వరకూ నిర్మాతలంతా సహనంతో ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మొద్దని, షూటింగ్స్ ను, సినిమా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించవచ్చని నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో తెలిపారు.

అవార్డు విజేతలకు అభినందనలు
68వ జాతీయ సినీ అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’, ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్, నృత్య దర్శకురాలిగా సంధ్యారాజ్, ఉత్తమ మేకప్ మ్యాన్ గా టి.వి. రాంబాబు ఎంపికైన విషయం తెలిసిందే. వీరందరికీ తెలుగు నిర్మాతల మండలి అభినందనలు తెలియచేసింది. అలానే ఉత్తమ నటుడిగా ఎంపికైన సూర్యకు, ఆయన నటించి నిర్మించిన ‘సూరారై పోట్రు’ బృందానికి, ఇతర అవార్డుల విజేతలకు శుభాభినందనలు తెలిపింది.

Exit mobile version