‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు చిత్రసీమలోనూ, అటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు లేపుతున్నాయి. వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎదురు దాడికి దిగారు. నిజం చెప్పాలంటే చిత్రసీమ నుండి పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా పెద్దవాళ్ళెవరూ పెదవి విప్పలేదు. కార్తికేయ, సంపూర్ణేశ్ బాబు, నాని వంటి వారు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని మాత్రం కోరారు. మోహన్ బాబు తన మనసులోని మాటలను అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికల అనంతరం చెబుతానని అన్నారు. ఇదిలా ఉండగా… తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ లేఖను విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు తమకు రెండు కళ్ళు లాంటివని, ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు, సహకారంతోనే చిత్రసీమ మనుగడ సాగిస్తోందని తెలిపింది. ఈ లేఖ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ దాస్ కె నారంగ్ సంతకంతో వెలువడింది.
ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ దాస్ కె నారంగ్ సంతకంతో వెలువడిన ఈ లేఖ సారాంశం ఇలా ఉంది. ”కరోనా పేండమిక్ సిట్యుయేషన్ నుండి, ఇతర సమస్యలనుండి బయటపడే మార్గం చూపించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని తెలుగు సినిమా రంగం కోరింది. ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని గారి ఆహ్వానం మేరకు ఇటీవల ఓ బృందం ఆయనను కలిసి చిత్రసీమకు సంబంధించిన సమస్యలను విన్నవించింది. వై. యస్. జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం మా సమస్యలను సావధానంగా విని, సానుకూలంగా స్పందించింది. అతి త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రల విభజన తాకిడి, కరోనా మహమ్మారి, ఇతర సమస్యల కారణంగా చిత్రసీమ గతంలో ఎన్నడూ లేనంతగా నష్టపోయింది. ఇటీవల సినిమా రంగానికి చెందిన కొందరు వ్యక్తులు వివిధ వేదికలపై తమ ఆవేదనను, ఆక్రోశాన్ని, అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. అది చిత్ర పరిశ్రమ అభిప్రాయం కాదు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ళుగా సినిమా రంగానికి ఎంతో సహకారం అందిస్తున్నాయి. వారి సహకారం లేకుండా చిత్రసీమ మనుగడ అసాధ్యం. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అదే సహకారాన్ని ప్రభుత్వాల నుండి ఇప్పుడు కూడా కోరుతోంది.
మార్చి 2020 నుండి సినీ రంగానికి చెందిన వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషమ పరిస్థితిలో మన నాయకులు, ప్రభుత్వాలు పెద్ద మనసుతో తమ సహకారాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తెలుగు సినిమా రంగానికి రెండు కళ్ళు లాంటివి. రెండు రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులు క్రియాశీలక సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. వారి ఆశీస్సులు, సహకారం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాం” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
