Site icon NTV Telugu

ఐపీఎస్ అధికారిని నిరాశ పరిచిన “భీమ్లా నాయక్”

Bheemla-Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ నిన్న బయటకు వచ్చింది. పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో లైక్‌లను నమోదు చేసింది. థమన్ స్వరకల్పన, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పవన్ పాత్ర హీరోయిజాన్ని సాంగ్ ద్వారా మరింత పెంచాయి. “ఇరగదీసే ఈడి ఫైర్ సల్లగుండా.. ఖాకీ డ్రెస్ పక్కనపెడితే వీడే పెద్ద గుండా” అంటూ పాట మొదలు పెట్టిన రామజోగయ్య శాస్త్రి రకరకాల పద ప్రయోగాలు చేశాడు. అయితే ఈ సాంగ్ పై ఓ ఐపీఎస్ అధికారి మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Read Also : మణిరత్నంపై కేసు నమోదు

తెలంగాణ సీనియర్ ఐపిఎస్ అధికారి, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిసిపి ఎం రమేష్ ఈ పాటలో పోలీసు శాఖను చిత్రీకరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా రామజోగయ్య శాస్త్రి పాట రాసిన విధానాన్ని విమర్శించారు. దానికి కారణం ఆయన పోలీసులు అంటేనే మనుషులను ఇరగదీసే వారు అన్నట్టు రాయడమే. “తెలంగాణా పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు, వారిని కాపాడటానికి మాకు జీతం పొందిన వారి ఎముకలను మేము విరగ్గొట్టం, ఆశ్చర్యకరంగా రామజోగయ్య శాస్త్రికి ఒక పోలీసు ధైర్యాన్ని వివరించడానికి తెలుగులో తగినంత పదాలు దొరకలేదా? పాటలో సేవ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు” అంటూ ప్రశ్నించారు.

అయితే ఈ విషయంపై రామజోగయ్య శాస్త్రి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ తనకు ఈ పాటకు సాహిత్యం అందించే అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు, త్రివిక్రమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. “పిలిచి బ్లాక్ బస్టర్ హిట్టు పాట కట్టబెట్టిన ప్రియతములు శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ త్రివిక్రమ్ గార్లకు ధన్యవాదాలు. ముఖ్యంగా మొదటిసారి విన్నప్పుడు ప్రతీ లైన్ కి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానం ఎప్పటికీ మరచిపోలేను. ఆ అరగంట సమయం అమూల్యం. తమన్ సృజన విభిన్నం వినూత్నం గంభీరం” అంటూ ట్వీట్ చేశారు.

పవన్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో నటించిన “భీమ్లా నాయక్”కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నాగ వంశీ నిర్మించారు.

Exit mobile version