NTV Telugu Site icon

Tanikella Bharani : బహుముఖ ప్రజ్ఞాశాలి భరణి!

Bharani 1

Bharani 1

(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు)
నేడు నటునిగా తనదైన బాణీ పలికిస్తూ అందరినీ అలరిస్తోన్న తనికెళ్ళ భరణి కలం బలం తెలియాలంటే ఓ మూడు దశాబ్దాలు పైగా వెనక్కి వెళ్ళాలి. జనబాహుళ్యంలో ఉన్న పదాలతో పసందైన సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు భరణి. ఇక నటనలో అడుగు పెట్టాక, తనకు లభించిన ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనే తపించారు. ఇప్పటికీ ఆ తపనతోనే సాగుతున్నారాయన. అందుకే భరణి అభినయం జనానికి మొహం మొత్తలేదు. ఆయన కామెడీ చేసినా, సెంటిమెంట్ పండించినా, విలనీ ప్రదర్శించినా జై కొడుతూనే ఉన్నారు జనం. మెగా ఫోన్ పట్టి దర్శకునిగానూ అలరించారు.

తనికెళ్ళ భరణి 1954 జూలై 14న జన్మించారు. తిరుపతి వేంకటకవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి, విఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ వంటివారు తనికెళ్ళ భరణికి బంధువులు. అలా భరణి ఇంట్లోనూ సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉండేది. చిన్నతనంలోనే భరణి తెలుగు, ఇంగ్లిష్, హిందీ సాహిత్యంలో మంచి ప్రవేశం సంపాదించారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు, కవితలు రాస్తూ సాగారు. డిగ్రీ పూర్తయ్యాక నటుడు రాళ్ళపల్లి చెంత చేరారు భరణి. ఆయన సలహాలు, సూచనలు పాటించారు. చిత్రసీమలో అడుగు పెట్టారు. చెన్నై చేరి తొలిగా సుమన్ హీరోగా రూపొందిన ‘కంచు కవచం’కు మాటలు రాసేశారు. తొలి చిత్రంలోనే తనదైన మార్కు కనబరిచారు భరణి. ‘క’ భాషతో కబడ్డీ ఆడేశారు అంతకు ముందు ఎందరో రచయితలు. భరణి కూడా ఆ బాటలోనే పయనించినా, తనదైన బాణీ పలికిస్తూ ‘జ’భాష కనిపెట్టేశారు. ‘లేడీస్ టైలర్’లో పెట్టేశారు. ఇంకేముంది జనం భరణి రాసిన ‘జమజచ్చ’కు జేజేలు పలికారు. అదే సినిమాలో ఓ చిన్న పాత్రలోనూ భరణి కనిపించి ఆకట్టుకున్నారు. తరువాత వంశీ దర్శకత్వంలో రూపొందిన కొన్ని చిత్రాలకు మాటలు పలికిస్తూనే, నటునిగాను అలరించారు. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’కు కూడా భరణి మాటలే భలేగా పేలాయి. ఇక అందులో నానాజీ పాత్రలో ఆకట్టుకున్నారు. అటుపై నటరచయితగా సాగిన భరణికి, అభినయ పరంగానే అవకాశాలు అధికమయ్యాయి. దాంతో సినిమా రచనకు బై బై చెప్పాల్సి వచ్చింది.

వందలాది చిత్రాలలో తనికెళ్ళ భరణి తనదైన బాణీ పలికిస్తూ నటించారు. అయితే తనకు అన్నం పెట్టిన రచనను మాత్రం వదలుకోకుండా, ‘ఆట కదరా శివా…’ అంటూ పాటలూ రాస్తూ భక్తి పారవశ్యం చెందారు. ఆపై మెగా ఫోన్ పట్టి ‘సిరా’ అనే లఘుచిత్రం రూపొందించారు. కేవలం రెండు పాత్రలతోనే ‘మిథునం’ చిత్రం తెరకెక్కించీ అలరించారు. ఈ సినిమా ద్వారా ఉత్తమ మాటల రచయితగా నందిని సొంతం చేసుకున్నారు భరణి. అంతకు ముందు బెస్ట్ విలన్ గా ‘సముద్రం’ సినిమాతోనూ, బెస్ట్ కేరెక్టర్ యాక్టర్ గా ‘నువ్వు-నేను’తోనూ నంది అవార్డులు అందుకున్నారాయన. ఇప్పటికీ నటునిగా బిజీగా సాగుతున్న తనికెళ్ళ భరణి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా తనదైన పంథాలో సాగాలని ఆశిద్దాం.