ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని పచ్చి నిజాలను వెల్లడించారు. అప్పటి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను అడ్డం పెట్టుకుని కొందరు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ప్రేక్షకులను దోచుకున్నారని, టిక్కెట్ రేట్లను అధిక ధరలకు అమ్మి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ రేటును చూపించి, టాక్స్ ఎగ్గొట్టారని అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం పాత టిక్కెట్ రేట్లను అమలు చేయాలని అనగానే మరికొందరు కోర్టు తలుపు తట్టారని చెప్పారు. ఇక మీదట అయినా ప్రభుత్వం సూచించిన రేట్లకు టిక్కెట్లను అమ్మి, నిజాయితీగా పన్నులు కట్టాలని హితవు పలికారు.
భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు లగ్జరీస్ ను అదుపు చేసుకోవాలని, తద్వారా సినిమా షూటింగ్ డేస్ తగ్గుతాయని తెలిపారు. నటీనటుల రెమ్యూనరేషన్స్ తగ్గించుకోమనో, మూవీ మేకింగ్ క్వాలిటీ విషయంలో రాజీ పడమనో ఎవ్వరూ చెప్పరని అన్నారు. కాల్షీట్స్ ను సక్రమంగా ఉపయోగించుకుని చిత్రీకరణ జరిగితే నలభై శాతం బడ్జెట్ తగ్గుతుందని చెప్పారు. భారీ బడ్జెట్ చిత్రాల విడుదల సమయంలో స్క్రీన్స్ పరిమితి లేకుండా అత్యధిక థియేటర్లలో ప్రదర్శిస్తున్నారని, ఆ రకంగా మొదటి రెండు మూడు రోజుల్లోనే భారీ మొత్తం వెనక్కి వస్తోందని, దానికి అదనంగా టిక్కెట్ ధరలను కూడా పెంచమనడం ఎంతమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఇవాళ సినిమా ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోల్చితే ఎంతో పెరిగిందని, కాబట్టి టిక్కెట్ రేట్ల వ్యవహారం తన దృష్టిలో చాలా చిన్నదని భరద్వాజ వ్యాఖ్యానించారు.
