తమిళంలో ‘కుట్టి స్టోరీ’, తెలుగులో ‘పిట్ట కథలు’లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి అమలా పాల్‌కు 2021 సంవత్సరం మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. అమలా పాల్ ప్రస్తుతం ‘ కాడవర్ ‘తో పాటు పలు చిత్రాలలో నటిస్తోంది. నూతన సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం ఆమెకు గోల్డెన్ వీసాను అందించడం విశేషం.
ఈ శుభవార్తను పంచుకుంటూ అమలా పాల్ “ఇలాంటి గౌరవం లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. గొప్పగా భావిస్తున్నాను. నేను ఇప్పుడు దుబాయ్‌లో భాగమని భావిస్తున్నాను. దుబాయ్ నాకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి… నేను తరచూ సందర్శిస్తూనే ఉంటాను. దుబాయ్ అనేది అందం, విలాసవంతమైన అంశాల గురించి మాత్రమే కాదు. దేశంలోని ప్రతి వ్యక్తి దృష్టి, నినాదం, ఇది పూర్తిగా నిర్మాణాత్మకమైనది, సానుకూలమైనది. అక్కడి ప్రజలు అద్భుతంగా ఉన్నారు. ఈ అద్భుతమైన అధికారాన్ని నాకు అందించడానికి కృషి చేసిన దుబాయ్ ప్రభుత్వానికి, అధికారులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
కాడవర్, ఆడు జీవితం, అధో అంధ పరవై పోలా వంటి చిత్రాలలో అమలా పాల్ కనిపించబోతోంది. ఆమె హిందీలో కూడా వెబ్ సిరీస్‌తో అరంగేట్రం చేయనుంది. అమలా పాల్ కంటే ముందు, మమ్ముట్టి, మోహన్‌లాల్, టోవినో థామస్, రాధాకృష్ణన్ పార్థిబన్, త్రిష, షారూఖ్ ఖాన్‌లతో సహా పలువురు నటులు గోల్డెన్ వీసాను అందుకున్నారు.
యూఏఈ గోల్డెన్ వీసా అనేది దీర్ఘకాలిక నివాస వీసా వ్యవస్థ.ఇది ఐదు నుండి 10 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది. గడువు ముగిసిన తరువాత దానంతట అదే రెన్యూవల్ అవుతుంది. దీనిని వివిధ రంగాలలోని నిపుణులు, పెట్టుబడిదారులకు మంజూరు చేస్తారు దుబాయ్ అధికారులు.
