Tamil Actor Simbu Turned Singer For Double XL Movie: తమిళ స్టార్ హీరో శింబు నటునిగానే కాదు, గాయకునిగా, గీతరచయితగా, సంగీత దర్శకునిగా తన ఆల్ రౌండర్ ప్రతిభను చాటుకుంటున్నారు. పలు విషయాల్లో తండ్రి టి.రాజేందర్ అడుగుజాడల్లోనే నడుస్తున్న శింబు మరో మెట్టు ఎక్కి పరభాషా చిత్రాల్లో తాను నటించక పోయినా, గాయకునిగా గళం విప్పి అలరిస్తున్నారు. ఇంతకు ముందు తెలుగులో యన్టీఆర్ ‘బాద్ షా’, రామ్ ‘ద వారియర్’ చిత్రాల్లో శింబు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హిందీ చిత్రం ‘డబుల్ ఎక్స్ ఎల్’ కోసం తొలిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ “తాలి తాలి…” అంటూ సాగే పాటను ఆలపించారు శింబు. ఈ పాట ఉత్తరాదిన ఓ ఊపు ఊపేస్తూ ఉండడం విశేషం!
సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి బొద్దుగుమ్మలుగా దర్శనమివ్వనున్న ‘డబుల్ ఎక్స్ ఎల్’ సినిమా రోజుకో విశేషంతో జనాన్ని ఆకట్టుకుంటోంది. మొన్న ఈ సినిమాలో శిఖర్ ధవన్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నట్టు తెలిపారు. ఇప్పుడేమో తమిళ హీరో శింబును గాయకునిగా తమ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం చేస్తున్నట్టూ ప్రకటించారు. ఈ పాటను తన మిత్రుడు మహత్ రాఘవేంద్ర కోసం ఈ పాట పాడినట్టు తన సోషల్ మీడియాలో శింబు పేర్కొన్నారు. ఇందులో జహీర్ ఇక్బాల్ తో కలసి మహత్ రాఘవేంద్ర కూడా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. మహత్ కు ‘డబుల్ ఎక్స్ ఎల్’ తొలి హిందీ చిత్రం కావడం విశేషం! శింబు పాడిన “తాలి తాలి…” పాటేమో ఊపేస్తోంది. మరి సినిమా ఏ తీరున అలరిస్తుందో చూడాలి. నవంబర్ 4న ‘డబుల్ ఎక్స్ ఎల్’ జనం ముందుకు రానుంది.