The Tatas Web Series: వ్యాపార ప్రపంచంలో టాటా పేరు తెలియని వాళ్ళు ఉండరు. కేవలం ఒక కంపెనీకి మాత్రమే కాదు, భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది టాటా పరిశ్రమ. దేశ పారిశ్రామిక రంగాన్ని తీర్చిదిద్దిన టాటా కుటుంబ చరిత్ర ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ పరిశ్రమ, సామాజిక సేవ, విలువలు, నాయకత్వం కలగలిపిన ఈ గాథను తెరపై ఎలా ఆవిష్కరిస్తారనే ఆసక్తి ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా టాటా కుటుంబం నాలుగు తరాల ప్రయాణాన్ని ఒకే సిరీస్‌లో చూపించనున్నట్లు ప్రకటించడంతో వ్యాపారవేత్తలు, సినీ అభిమానులు, చరిత్రపై ఆసక్తి ఉన్నవారిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ‘Made in India: A Titan Story’ విజయంతో మంచి గుర్తింపు పొందిన టీ సిరీస్ ఫిల్మ్స్, ఆల్మైటీ మోషన్ పిక్చర్ ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి చేతులు కలిపాయి. ఈసారి ‘ది టాటాస్’ పేరుతో ప్రీమియం మల్టీ సీజన్ డ్రామా సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ప్రముఖ జర్నలిస్టు, రచయిత గిరీష్ కుబేర్ రచించిన ‘The Tatas: How a Family Built a Business and a Nation’ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ రూపొందనుంది. ఈ పుస్తకం గజ్ క్యాపిటల్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకోవడం విశేషం.
ఈ సిరీస్‌లో టాటా కుటుంబ చరిత్రను కేవలం వ్యాపార కోణంలో మాత్రమే కాకుండా, భారత దేశ నిర్మాణంలో వారి పాత్రను కూడా విస్తృతంగా చూపించనున్నారు. వ్యవస్థాపకుడు జంషెడ్జీ నుసెర్వాంజీ టాటా నుంచి ప్రారంభమయ్యే ఈ కథ, దొరబ్జీ టాటా, జె.ఆర్.డి. టాటా, రతన్ నవల్ టాటా వంటి ప్రముఖుల నాయకత్వాన్ని వివరిస్తూ నాలుగు విభిన్న తరాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురానుంది. కార్పొరేట్ నైతిక విలువలు, పారిశ్రామిక విప్లవం, దేశాభివృద్ధికి చేసిన సేవలు, సేవా కార్యక్రమాలు ఈ కథలో కీలక భాగాలుగా ఉండనున్నాయి. టీ సిరీస్ ఫిల్మ్స్ అధినేత భూషణ్ కుమార్ మాట్లాడుతూ, టాటా కుటుంబ చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ‘Made in India: A Titan Story’ కు లభించిన ఆదరణ చూస్తుంటే రియల్ స్టోరీల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలుస్తోందని ఆయన అన్నారు. భారత దేశంలో టాటా కుటుంబం పోషించిన పాత్రను కొత్త తరానికి చేరవేయడమే ఈ సిరీస్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సిరీస్‌కు ‘Made in India: A Titan Story’ కు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన కరణ్ వ్యాస్ కథను రూపొందిస్తున్నారు. లాభాలకే పరిమితం కాకుండా, సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థలను నిర్మించిన నాయకుల కథ ఇదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఆల్మైటీ మోషన్ పిక్చర్ సహ వ్యవస్థాపకురాలు ప్రభలీన్ సంధు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక వ్యాపార సామ్రాజ్యం కథ మాత్రమే కాదని, భారతదేశాన్ని తీర్చిదిద్దిన విలువలు, ఆలోచనలు, సంస్థల ప్రయాణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సిరీస్‌పై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, దర్శకుడు ఎవరు ? ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారు? అనే విషయాలను నిర్మాతలు ఇంకా వెల్లడించలేదు. అయితే టాటా కుటుంబం వంటి గొప్ప వారసత్వాన్ని తెరపై ఎలా ఆవిష్కరిస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

