Site icon NTV Telugu

Sushmita Sen: ఆ రొంపి నుంచి అలా బతికి బయటపడ్డాను

Sushmita Sen About Marriage

Sushmita Sen About Marriage

బాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్లలో సుశ్మితా సేన్ ఒకరు. ఈమె సినిమాల పరంగా కన్నా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లోకెక్కుతుంది. సాధారణంగా మహిళలు ఒక వయసుకి వచ్చాక, పెళ్లి చేసుకొని సెటిలవుతారు. కానీ, సుశ్మితా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది. మీడియా తారసపడినప్పుడల్లా.. పెళ్లెప్పుడు? అసలెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? అనే ప్రశ్నలు ఈమె ఎదురవుతూ ఉంటాయి. వీటిపై ఎప్పుడూ పెద్దగా స్పందించని సుశ్మితా.. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ట్వింకిల్‌ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘ట్వీక్‌ ఇండియా: ది ఐకాన్స్‌’ కార్యక్రమంలో స్పందించింది.

‘‘అదృష్టవశాత్తు నేను నా జీవితంలో కొందరు ఆసక్తికరమైన వ్యక్తుల్నే కలిశాను. మొదట్లో వారితో ప్రయాణం బాగానే అనిపించింది. కానీ, కాలక్రమంలో వాళ్లు నా అంచనాల్ని అందుకోలేదు. ఒక దశకు చేరుకున్నాక వాళ్లు నన్ను నిరాశపరిచారు. అందుకే, పెళ్లిదాకా వెళ్లలేదు’’ అని సుశ్మితా వెల్లడించింది. నిజానికి తనకు మూడుసార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడిందని.. వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లానని తెలిపింది. కానీ.. ఆ దేవుడు తనని రక్షించాడని, తనతో పాటు తన పిల్లల్ని కాపాడుతూ వస్తున్నాడని చెప్పింది. ఎలాంటి చెడు బంధంలోకి వెళ్లనివ్వకుండా, ఆ దేవుడు సురక్షితంగా చూసుకుంటున్నాడని వెల్లడించింది. పెళ్లిని చెడు బంధంతో పోల్చిందంటే, తన జీవితంలోకి వచ్చిన వాళ్లు సుశ్మితాని ఎంతలా బాధ పెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

తనకు పెళ్లి జరగకపోవడం వెనుక పిల్లలు కారణం కాదని, వాళ్లకు ఎలాంటి సంబంధమూ లేదని సుశ్మితా పేర్కొంది. తన జీవితంలోకి వచ్చిన ప్రతిఒక్కరినీ పిల్లలు స్వీకరించారని, సమానమైన గౌరవంతో పాటు ప్రేమ ఇచ్చారంది. కాగా.. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుశ్మితా, 2000 సంవత్సరంలో రెనీని, ఆ తర్వాత 2010లో అలీసాను దత్తత తీసుకుంది. 1996లో వచ్చిన ‘దస్తక్‌’ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ.. కొన్నాళ్లు ఇండస్ట్రీని ఏలింది. ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో సత్తా చాటుతోంది.

Exit mobile version