Site icon NTV Telugu

రియల్ చినతల్లికి సూర్య సూపర్ హెల్ప్… అసలైన ‘జై భీమ్’పై ప్రశంసలు

Surya

Surya

సూర్య, మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో టి.సి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై బీమ్’. ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు రాజకీయ నేతలు, పలువురు సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విభిన్నమైన స్క్రీన్ రివ్యూలతో ఈ చిత్రం వినోదాన్ని పంచుతుంది. తాజాగా మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ సూర్యను ప్రశంసిస్తూ ఓ లేఖను రాశారు. ఆ ప్రశంసాపత్రంలో రియల్ చినతల్లి… రాజకన్ను భార్య పార్వతి అమ్మాళ్‌కు సహాయం చేయాలని చిత్ర నిర్మాణ సంస్థను అభ్యర్థించారు. దీనిపై స్పందించిన నటుడు సూర్య ఓ ప్రకటన విడుదల చేశారు.

Real Also : “బిగ్ బాస్ 5” సెన్సేషన్ గా సన్నీ… కౌశల్ వైబ్స్

ఆయన లేఖకు సూర్య స్పందిస్తూ ” బాలకృష్ణన్ అభినందన లేఖను అందుకున్నాను. ‘జై భీమ్’ చిత్రాన్ని హృదయపూర్వకంగా అభినందించినందుకు ధన్యవాదాలు. పేద, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ఆ దార్శనికతనే జీవన విధానంగా స్వీకరించిన వారు ఎప్పుడూ అండగా నిలవడం చూశాను. ఈ సందర్భంలో కమ్యూనిస్టు ఉద్యమం అందించిన అపారమైన సహకారాన్ని సినిమాలో వీలైనంతగా చూపించాము. అలాగే మేము న్యాయమూర్తి కె. చంద్రు, గౌరవనీయులైన పోలీస్ చీఫ్ పెరుమాళ్ సామి సహకారాన్ని కూడా ఇందులో చూపించాము.

దివంగత రాజకన్ను, ఆయన భార్య పార్వతి అమ్మాళ్ కి దూరదృష్టితో కూడిన సహకారం అందించాలని మేము భావిస్తున్నాము. వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు జీవితాంతం మేలు చేసేలా వారి పేరు మీద ‘పది లక్షల’ రూపాయలను డిపాజిట్ చేసి, ప్రతినెలా వడ్డీ వచ్చేలా నిర్ణయం తీసుకున్నాం. ఆమె తదనంతరం ఆ డబ్బు తన వారసులకు వెళ్లేలా చేయవచ్చు. మైనారిటీ గిరిజన వర్గాల విద్యార్థుల విద్యావకాశానికి సహాయం చేయడం గురించి కూడా మేము ఆలోచిస్తున్నాము. భవిష్యత్తు తరాల ప్రగతికి విద్యే శాశ్వత పరిష్కారం” అంటూ పెద్ద మనసును చాటుకున్నాడు సూర్య. దీంతో సూర్య రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం #westandwithsuriya అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నిజంగానే ఆయన పెద్ద మనసుకు, సమాజానికి చేతనైన సాయం చేయాలనే మనస్తత్వానికి, తపనకు హ్యాట్సాఫ్ చేస్తున్నారు ప్రజలు.

Exit mobile version