Suriya- Jyothika:కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క వీరు సినిమాల్లో నటిస్తూనే సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇవి కాకుండా ఈ జంట చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికి తెల్సిందే. ఇప్పటికే సూర్య అగారం ఫౌండేషన్ ద్వారా అనాధ పిల్లలను చదివిస్తున్నాడు. అంతేకాకుండా ఎంతోమంది చిన్నారులకు ఆపరేషన్స్ అని, చదువులు అని ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ జంట మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు.
సూర్య హీరోగా జ్యోతిక నిర్మించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకున్న ఈ మూవీ తరువాత సూర్య జ్యోతికి గిరిజనుల పిల్లల చదువుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా వారి కోసం ఏర్పాటు చేయబడిన పళన్ కుడి ఇరులర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు సూర్య, జ్యోతిక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. అది కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ చేతులమీదుగా ఇప్పించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలియడంతో ఈ దంపతులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
