కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ‘సింగం-2’ తర్వాత దాదాపు 13 ఏళ్లుగా థియేట్రికల్ పరంగా సరైన కమర్షియల్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇటీవల వచ్చిన ‘కరుప్పు’ సినిమా ఊహించని భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 320 కోట్ల గ్రాస్ మార్కును దాటి సంచలనం సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య తనకు హిట్ ఇచ్చిన దర్శకులను నమ్మి వరుసగా మరో ఛాన్స్ ఇస్తూ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు.
ఇందులో భాగంగానే ‘కరుప్పు’ చిత్రంతో తనకు బిగ్గెస్ట్ థియేట్రికల్ సక్సెస్ అందించిన క్రేజీ డైరెక్టర్ RJ బాలాజీకి సూర్య మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. సూర్య కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 50వ సినిమాకు ఆర్జే బాలాజీనే దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే గతంలో తనకు ఓటిటిలో ‘జై భీమ్’ లాంటి క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కు కూడా సూర్య మరో క్రేజీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, సూర్య లైనప్ ప్రస్తుతం విభిన్నమైన ప్రాజెక్టులతో సాలిడ్ గా కనిపిస్తోంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఇప్పటికే సెట్స్‌పై ఉండగా మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జీతు మాధవన్ తో కూడా సూర్య ఒక సినిమా చేయబోతున్నారు. మొత్తానికి హిట్ కాంబినేషన్లను రిపీట్ చేస్తూ సరికొత్త దర్శకులతో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సూర్య బాక్సాఫీస్ వద్ద తన సునామీని కంటిన్యూ చేయడానికి పక్కా ప్లాన్‌తో దూసుకుపోతున్నారు.
