NTV Telugu Site icon

Rajinikanth Birthday: రామారావుతో రజనీ’బంధం’.. ఈ విషయాలు మీకు తెలుసా?

Rajinikanth

Rajinikanth

Rajinikanth Birthday:  తెలుగు చిత్రసీమతో మొదటి నుంచీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనుబంధం ఉంది. రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. అప్పట్లో రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే సెకండ్ షోస్ లో చూసేవారు. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే రజనీకాంత్‌కు ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్ని బెంగళూరులో పలు మార్లు చూశానని చెబుతారు రజనీ. ఆరంభంలో ఎన్టీఆర్‌ను అనుకరిస్తూ నటించేవారు రజనీకాంత్. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం ‘అంతులేని కథ’. అందులో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి…’ పాటలో రజనీకాంత్ బాణీ చూస్తే, ఆయన ఎంతలా రామారావును ఇమిటేట్ చేస్తారో అర్థమవుతుంది. ఆ పాట మధ్యలో సిగరెట్ ఎగరేస్తూ తన స్టైల్‌నూ చూపించారు రజనీ.

ఇక తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో కలసి రజనీకాంత్ ‘టైగర్’లో నటించారు. 1979లో తెరకెక్కిన ఈ చిత్రానికి నందమూరి రమేశ్ దర్శకుడు. ‘టైగర్’ షూటింగ్ సమయంలోనే తాను అన్న ఎన్టీఆర్‌ను ఎంతలా అభిమానించింది పదే పదే ఇంటర్వ్యూలలో చెప్పారు రజనీకాంత్. ఎన్టీఆర్ ‘టైగర్’లో రజనీకాంత్ కీ రోల్ పోషించే సమయంలోనే రామారావు మరోవైపు తన ‘శ్రీమద్విరాట పర్వం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో శ్రీకృష్ణ, అర్జున, సుయోధన, కీచక, బృహన్నల వంటి ఐదు విలక్షణమైన పాత్రలు పోషించి అలరించారు రామారావు. ఆ చిత్రాన్నీ బెంగళూరులో చూసి తరించానని రజనీ చెప్పేవారు. ఎన్టీఆర్ డైరెక్షన్ లో శ్రీకృష్ణునిగా నటించాలన్నది శోభన్ బాబు అభిలాష. అదే తీరున రామారావు దర్శకత్వంలో ఏదో ఒక చిత్రంలో నటిస్తే చాలని రజనీకాంత్ కోరిక. ఈ ముచ్చట్లను శోభన్‌తో రజనీకాంత్ కలసి నటించిన ‘జీవనపోరాటం’ సమయంలో పంచుకున్నారు. శోభన్, రజనీ ఇద్దరి కోరికలూ నెరవేరలేదు.

అప్పట్లో రజనీకాంత్ సమయం దొరికితే చాలు మందు కొట్టేవారట. ఈ విషయం ఎన్టీఆర్‌కు తెలిసి, ‘బ్రదర్…మీకు ఎంతో భవిష్యత్ ఉంది… ఆ మందు అలవాటు మానుకోండి…’ అని సూచించారట. అంతేకాదు, ఆ అలవాటు మానుకోవడానికి యోగ, ప్రాణాయామం ఆశ్రయించమని చెప్పారట. అంతకు ముందే యోగాభ్యాసం చేస్తున్నా, ఎన్టీఆర్ సలహా ఇచ్చిన తరువాత సీరియస్‌గా తీసుకొని, దానిని మరింత నిష్టతో అభ్యాసం చేశారు రజనీ. ఆ తరువాత ఆయన ఆధ్యాత్మిక చింతనలో సాగడం ఆరంభించారు. ఆ సాధన తరువాతే రజనీకాంత్ తమిళనాట అనూహ్యంగా సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు. అయినా రజనీకాంత్ ఏ నాడూ ఆధ్యాత్మిక చింతనకు దూరం కాలేదు. తరచూ హిమాలయలకు వెళ్ళి అక్కడ బాబాలను దర్శించుకొని వస్తూ ఉంటారు. అలా వెళ్ళి వచ్చిన ప్రతీసారి రజనీకాంత్‌కు ఏదో ఒక మంచి జరిగేదని చెబుతారు.

ఆధ్యాత్మిక భావనతోనే ‘బాబా’ చిత్రాన్ని సొంతంగా నిర్మించి, నటించారు అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్లుకోలేక పోయింది. కొనుగోలు దారులు నష్టాల పాలయ్యారు. వారి నష్టాన్ని భర్తీ చేసేందుకు కొంతమొత్తాన్ని తిరిగి ఇచ్చారు రజనీకాంత్. ఈ సంప్రదాయంలోనూ ఎన్టీఆర్‌నే రజనీకాంత్ అనుసరించడం విశేషం. ఎలాగంటే ఎన్టీఆర్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ను 1991లో విడుదల చేశారు. ఆ సినిమాపై క్రేజ్‌తో భారీ రేట్లకు కొన్నారు. అయితే ఆ చిత్రం జనాదరణ పొందలేక పోయింది. దాంతో కొనుగోలుదారులకు నష్టాలు వాటిల్లాయి. అప్పుడు ఎన్టీఆర్ నష్టపోయినవారికి పరిహారం చెల్లించారు. అదే పంథాలో రజనీ సైతం సాగడం గమనార్హం.

ఇలా రామారావు అంటే ఎంతగానో అభిమానించే రజనీకాంత్, 1995లో ఎన్టీఆర్‌ను చంద్రబాబు అండ్ కో బర్తరఫ్ చేసినప్పుడు వారి తరపున మాట్లాడారు. అప్పట్లో రజనీకాంత్‌తో ఏపీ అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తమిళనాట పెరియార్‌గా పేరొందిన రామస్వామి నాయకర్‌తో పోల్చారు రజనీకాంత్. తరువాత హైదరాబాద్ నుండి మద్రాసుకు బయలు దేరుతూ ఉండగా, ఎయిర్ పోర్ట్ లో మళ్ళీ విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు.. తానెప్పటికీ అన్న ఎన్టీఆర్ అభిమానినేనని గర్వంగా చెప్పుకున్నారు రజనీకాంత్. ఇప్పటికీ హైదరాబాద్ వచ్చిన ప్రతీసారి ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ ఉంటారు రజనీకాంత్. ‘అన్న లేని లోటు తీర్చలేనిది’ అని అంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకు ముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2016 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు రజనీకాంత్‌ను ఎంపిక చేసింది. ఆ అవార్డు ప్రదానం ఇంకా జరగలేదు. ఏది ఏమైనా అనేక విషయాల్లో ఎన్టీఆర్‌ను అభిమానించి, అనుసరించారు రజనీకాంత్. అయితే రాజకీయాల్లో మాత్రం ఎన్టీఆర్‌లా దూకుడు చూపించకుండానే పార్టీని పెట్టినట్టే పెట్టి అటకెక్కించారు రజనీ.

(డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు)

Show comments