Suhas: ‘కలర్ ఫోటో’ సినిమాతో నటుడిగా సుహాస్ మరో మెట్టు ఎక్కాడు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫోటో’ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక కావడంతో అతని చిత్రాల మీద అందరి చూపు పండింది. ఆ తర్వాత వచ్చిన ‘ఫ్యామిలీ డ్రామా’, ‘హిట్ -2’ సినిమాలు సుహాస్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. ఇక ఈ యేడాది విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’తో ఫ్యామిలీ ఆడియెన్స్ కూ అతను చేరువయ్యాడు.
ఇదిలా ఉంటే సుహాస్ హీరోగా అప్పుడెప్పుడో మొదలైన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మూవీ ఇప్పుడు షూటింగ్ ముగించుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది. జీఏ2 పిక్చర్స్, స్వేచ్ఛ క్రియేషన్స్, వెంకటేశ్ మహా నిర్మాణంలో దుశ్యంత్ కటికనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ కనిపించబోతున్నాడు. ఈ వేసవిలో మోత మోగించడానికి మల్లిగాడు వచ్చేస్తున్నాడంటూ చిత్ర నిర్మాతలు తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 11న మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సో… ఇక్కడ నుండి పబ్లిసిటీని మొదలెట్టి, పీక్స్ కు తీసుకెళ్ళి మూవీని జనం ముందుకు తెచ్చేస్తారన్నమాట. మరి ‘రైటర్ పద్మభూషణ్’తో జనాలను ఆకట్టుకున్న సుహాస్… ఇప్పుడీ మూవీతో మాస్ ను మెప్పిస్తాడేమో చూడాలి.
