మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ‘SSMB28’ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది కూడా! అయితే, అప్పట్నుంచి ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. మహేశ్ పూర్తిగా ‘సర్కారు వారి పాట’లో మునిగిపోవడంతో, అతడు ఆ సినిమా నుంచి ఫ్రీ అయ్యేదాకా SSMB28ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ రిలీజవ్వడం, అది మంచి విజయం సాధించడంతో.. SSMB28 ప్రాజెక్ట్ తిరిగి ట్రాక్‌లోకి వచ్చేసింది. ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్ళేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.
అయితే.. ఈలోపు సినీ ప్రియులకు ఓ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. మేకర్స్ SSMB28 ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేయనున్నారు. టైటిల్ ఏంటన్నది ఇంకా బయటకు పొక్కలేదు కానీ, ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం ఒక క్రేజీ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. దీంతో.. ఆ టైటిల్, మహేశ్ లుక్స్ ఎలా ఉంటాయని ఫ్యాన్స్ సహా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, రెండో హీరోయిన్ పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనుంది.
మరోవైపు.. ఈ ప్రాజెక్ట్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలోనూ మహేశ్ ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఇది స్క్రిప్ట్ దశలో ఉంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను.. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకి తీసుకువెళ్ళేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇది భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా రూపొందనుంది.
