Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం!

  • జయకృష్ణ డెబ్యూ చిత్రం 'శ్రీనివాస మంగాపురం'
  • జులై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌
  • శ్రీనివాస మంగాపురంకు సెన్సార్ క్లియరెన్స్
Srinivasa Mangapuram Ua

Srinivasa Mangapuram Ua

సూపర్‌ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. జయకృష్ణ నటించిన డెబ్యూ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీకి తాజాగా సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఇక సినిమా జులై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ యువ నటి రషా థడానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహా సముద్రం’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి.. ఈసారి మరో భావోద్వేగభరిత ప్రేమకథను తెరపైకి తీసుకువస్తున్నారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో హీరో-హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు ఊపందుకోగా.. సెన్సార్ పూర్తి కావడంతో విడుదల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. జయకృష్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.