Site icon NTV Telugu

Waltair Veerayya: ‘నేనే చిరంజీవంటా’ అంటున్న ‘వాల్తేరు వీరయ్య’!

Waltair Veerayya Song

Waltair Veerayya Song

Sri Devi Chiranjeevi Song Released From Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి తన పేరును తానే ఉచ్చరించుకొని సంబరపడుతున్నారు. అదేంటి అంటారా? ఆ ముచ్చట రాబోయే మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ కోసం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే చిరంజీవి స్వయంగా ‘వాల్తేరు వీరయ్య’లోని పాటలో “నువ్వు శ్రీదేవయితే… నేనే చిరంజీవంటా…” అంటూ సాగే బిట్ ను జనం ముందు నిలిపారు. అభిమానులు ఆ పదాలు విని కిర్రెక్కి పోయారు. ఫ్యాన్స్ ను మరింత మురిపిస్తూ ‘వాల్తేరు వీరయ్య’లోని ఆ పాట సెకండ్ సింగిల్ గా సోమవారం సాయంత్రం విడుదలయింది.

“నువ్వు సీతవైతే… నేను రాముడినంటా…” అంటూ ఈ పాట మొదలవుతుంది. “నువ్వు రాధవైతే… నేను క్రిష్ణుడినంటా…”, “నువ్వు లైలావైతే…నేను మజ్నూనంటా…” అనే వాక్యాలు ఇందులో వరుసగా వినిపిస్తూ పోతాయి. హీరోయిన్ ను చూసి, హీరో పలు ఉపమానాలను వల్లిస్తూ ఈ పాట రూపొందింది. ఈ పాటను ఈ చిత్ర పంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రాశారు. జస్ ప్రీత్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. లోకం మెచ్చిన ప్రేమజంటలతో తనను, తన ప్రియురాలిని పోలుస్తూ సాగిన నాయకుని నోట ఉన్నట్టుండి మాస్ ను మురిపించేలా… “రాయే రాయే చేసేద్దాం లవ్వూ…” అంటూ ఊపందుకుంటుంది. ఈ సింగిల్ లో మధ్య మధ్యన చిరంజీవి డాన్స్ విజువల్స్ అభిమానులను అలరించేలా చోటు చేసుకున్నాయి.

తరువాత నాయిక నోట కూడా “నువ్వు మాటవైతే… నేను భావం అంటా…” వంటి పదాలు వినిపిస్తాయి. వెరసి ఈ పాట మొత్తం ఉపమానాలతో నాయికానాయకులు తమను పోల్చుకుంటూ సాగుతారు. ఈ తరహా పాటలు జనానికి కొత్తేమీ కావు. కానీ, దేవిశ్రీ ఆ పాత పంథాలోనే తనవైన పదనిసలు వినిపించే ప్రయత్నం చేశారు. మెలోడీ, బీట్ రెండూ కలగలసిన ఈ పాట జనవరి 13న విడుదలయ్యే ‘వాల్తేరు వీరయ్య’లో ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.

Exit mobile version