Site icon NTV Telugu

Vishnu Vinyasam: విష్ణు విన్యాసం లీక్.. బిగ్ మిస్టరీ

Vishnu Vinyasam

Vishnu Vinyasam

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘విష్ణు విన్యాసం’ సినిమా గురించిన చర్చలే నడుస్తున్నాయి, అయితే ఇది సినిమా విజయం గురించి కాదు, దాని వెనుక జరిగిన కొన్ని దిగ్భ్రాంతికరమైన పరిణామాల గురించి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఊహించని విపత్తును ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ మొత్తం లీక్ అయ్యిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది, చిత్ర యూనిట్‌కు చెందిన ఒక వ్యక్తి ద్వారానే ఈ ఫుటేజ్ బయటకు వెళ్లినట్లు సమాచారం. ఈ వీడియోను దక్కించుకున్న చెన్నైకి చెందిన కొందరు బ్లాక్‌మెయిలర్లు, గత ఫిబ్రవరి వరకు నిర్మాతలను భారీ స్థాయిలో డబ్బుల కోసం వేధించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ లీకు వ్యవహారం బయటకు వస్తే సినిమా బిజినెస్ దెబ్బతింటుందని భావించిన నిర్మాతలు, ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.

Also Read : Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మోహన్ బాబు లుక్ వైరల్!

బ్లాక్‌మెయిలర్ల బెదిరింపులు ఒకవైపు, లీకైన కంటెంట్ సోషల్ మీడియాలోకి వస్తుందనే భయం మరోవైపు ఉండటంతో.. చిత్ర యూనిట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన టీమ్, మిగిలి ఉన్న 20 రోజుల షూటింగ్‌ను కేవలం 7 రోజుల్లోనే పూర్తి చేసిందట. సాధారణంగా ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఉంటే ఖచ్చితంగా గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. కానీ ‘విష్ణు విన్యాసం’ విషయంలో మాత్రం మేకర్స్ మరో ఆలోచన లేకుండా శ్రీవిష్ణు నటించిన మరో సినిమా మృత్యుంజయ్ తో పోటీ పడి మరీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీనికి ప్రధాన కారణం లీక్ అయిన ఫుటేజ్ బయటకు రాకముందే థియేటర్లలో సినిమాను ప్రదర్శించాలనే ఆరాటమేనని తాజా వ్యాఖ్యలతో వెల్లడైంది. ఈ గందరగోళం వల్లే బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్ ఏర్పడిందని సమాచారం. మొత్తానికి, వెండితెరపై విన్యాసాలు చేయాల్సిన ఈ సినిమా, తెర వెనుక ఇన్ని కష్టాలను దాటుకుని రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version