NTV Telugu Site icon

Sravanthi Ravi Kishore: అభిరుచి గల నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్

Sravanthi Ravi Kishore

Sravanthi Ravi Kishore

నేడు సినిమా అంటే కళాసేవ కంటే కాసులపై ధ్యాసనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందరో అభిరుచిగల నిర్మాతలు మారుతున్న కాలంతో పాటు విలువలు కనుమరుగై పోవడంతో చిత్రనిర్మాణానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ అభిరుచితో చిత్రాలను నిర్మిస్తున్న అరుదైన నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన బ్యానర్ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారాయన. నవతరం ప్రేక్షకులకు మాత్రం స్టార్ హీరో రామ్ పోతినేని పెదనాన్నగా గుర్తుంటారు. ఏది ఏమైనా ‘స్రవంతి’ రవికిశోర్ ఈ నాటికీ తన అభిరుచికి తగ్గ చిత్రాలను తెరకెక్కిస్తూ సాగుతూ ఉండడం విశేషం!

రవికిశోర్ విజయవాడ వాస్తవ్యులు. చదువుకొనే రోజుల్లో చాలామందిలాగే సినిమాలంటే ఆసక్తి ఉన్నప్పటికీ, చదువును ఏ నాడూ అశ్రద్ధ చేయలేదు. ఛార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తూన్న సమయంలోనే రవికిశోర్ కు సినిమాల్లో అడుగు పెట్టాలన్న ఆలోచన కలిగింది. మీనమేషాలు లెక్కపెట్టకుండా అప్పట్లో విలక్షణ దర్శకునిగా సాగిపోతున్న వంశీ డైరెక్షన్ లో సినిమా తీయాలని తలపెట్టారు. తత్ఫలితంగా ‘లేడీస్ టైలర్’ను జనం ముందు నిలిపారు రవికిశోర్. హీరోగా రాజేంద్రప్రసాద్ కు మంచి మార్కులు సంపాదించి పెట్టిన తొలి చిత్రంగా ‘లేడీస్ టైలర్’ నిలచింది. ఈ సినిమా తరువాత రాజేంద్రుడు మరి వెనుతిరిగి చూసుకోలేదు. వంశీ దర్శకత్వంలో ద్వితీయ చిత్రంగా ‘మహర్షి’ని నిర్మించారు రవికిశోర్. ఈ సినిమా చూసినవారు బాగుంది అన్నారే కానీ, భలేగా ఉందని అనలేకపోయారు. ఆ పై వరుసగా “పుష్పకవిమానం, నాయకుడు, రెండు తోకల పిట్ట” వంటి అనువాద చిత్రాలతో రవికిశోర్ సక్సెస్ సాధించారు. మళ్ళీ స్ట్రెయిట్ మూవీపై మనసు పారేసుకొని వెంకటేశ్, సుహాసిని జంటగా ‘వారసుడొచ్చాడు’ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

కోరుకున్న సక్సెస్ దరి చేరగానే రవికిశోర్ వరుసగా “సిస్టర్ నందిని, చల్ చల్ గుర్రం, జైత్రయాత్ర, బలరామకృష్ణులు, రౌడీ మొగుడు, లింగబాబు లవ్ స్టోరీ” వంటి సినిమాలతో సాగిపోయారు. ఆ పై ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మావిచిగురు’ మంచి విజయం సాధించింది. తరువాత కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే నిర్మించిన ‘ఎగిరే పావురమా’ సైతం జయకేతనం ఎగురవేసింది. “గిల్లికజ్జాలు, పిల్ల నచ్చింది, మనసులో మాట” వంటి సినిమాలతో ముందుకు సాగిన రవికిశోర్ మళయాళ చిత్రం ‘నిరమ్’ హక్కులు తీసుకొని సినిమా తీసే ప్రయత్నంలో ఉండగా, ఆ చిత్రం గురించి తెలిసిన రామోజీరావు తమతో కలసి ఆ సినిమా నిర్మించాలని కోరారు. రామోజీరావుపై గౌరవంతో ఆ సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ ‘నిరమ్’ను తెలుగులో ‘నువ్వేకావాలి’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారానే దర్శకుడు విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్ కు భలే గుర్తింపు లభించింది.

విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లోనే వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం నిర్మించారు రవికిశోర్. ఒకప్పుడు ఆయన నిర్మించిన ‘వారసుడొచ్చాడు’లో జంటగా నటించిన వెంకటేశ్, సుహాసిని ఇందులోనూ నటించారు. కానీ, వెంకటేశ్ హీరో కాగా, సుహాసిని హీరోయిన్ అత్తగా కనిపించడం విశేషం!ఈ సినిమా సైతం ఘనవిజయం సాధించింది. త్రివిక్రమ్ లో కేవలం రచయితనే కాదు, దర్శకుడూ ఉన్నాడని గుర్తించిన రవికిశోర్ ఆయనను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘నువ్వే నువ్వే’ చిత్రం నిర్మించారు. యువతను ఈ సినిమా ఆకట్టుకుంది. తరువాత రవికిశోర్ మరికొన్ని చిత్రాలు నిర్మించారు. అందులో సుమంత్ హీరోగా నటించిన ‘గౌరీ’ మంచి విజయం సాధించింది.

మళ్ళీ రవికిశోర్ కు బంపర్ హిట్ లభించింది ‘రెడీ’తోనే అని చెప్పాలి. తన సోదరుని తనయుడు రామ్ హీరోగా రూపొందిన ‘రెడీ’ గ్రాండ్ సక్సెస్ సాధించడంతో వరుసగా రామ్ తో “గణేశ్… జస్ట్ గణేశ్, ఎందుకంటే ప్రేమంట!, మసాలా, శివమ్, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, రెడ్” వంటి చిత్రాలు నిర్మించారు. వీటిలో కొన్ని భలేగా అలరించాయి. మధ్యలో ధనుష్ ‘రఘువరన్ బి.టెక్.’ అనువాదాన్నీ అందించారు. కథ నచ్చితే చాలు, హుషారుగా ముందుకు సాగడం రవికిశోర్ నైజం! రామ్ ఇమేజ్ కు సరిపోయే కథ లభిస్తే చాలు అదే తీరున ముందడుగు వేస్తున్నారు. ‘రెడ్’ తరువాత రామ్ ‘ద వారియర్’లో నటించాడు. త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది. ఆ తరువాత ఏమైనా మళ్ళీ రామ్ తో రవికిశోర్ సినిమా ఉంటుందేమో చూడాలి.