నటరత్న యన్.టి.రామారావు,అంజలీదేవి నటించిన అనేక చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనే కాదు సాంఘికాల్లోనూ యన్టీఆర్ – అంజలీదేవి జంట భలేగా ఆకట్టుకుంది. అలా అలరించిన ఓ చిత్రం ‘పరువు-ప్రతిష్ఠ’. వాల్టా ప్రొడక్షన్స్ పతాకంపై జూపూడి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి మానాపురం అప్పారావు దర్శకత్వం వహించారు. 1963 మే 9న విడుదలైన ‘పరువు-ప్రతిష్ఠ’ మంచి ఆదరణ చూరగొంది. ఈ సినిమాకు ముందు యన్టీఆర్, అంజలీదేవి నటించిన ‘లవకుశ’ మహత్తర పౌరాణిక చిత్రంగా అనూహ్య విజయం సాధించి, జైత్రయాత్ర చేస్తున్న సమయంలోనూ ‘పరువు-ప్రతిష్ఠ’ను జనం ఆదరించడం విశేషం!
Read Also: Kushi: ‘ఆరా బేగమ్’పై మనసు పారేసుకున్న ‘ది’ దేవరకొండ…
‘పరువు-ప్రతిష్ఠ’ కథ విషయానికి వస్తే- రఘు ఓ ధనవంతుని కొడుకు. సుశీల ఓ కంపెనీలో పనిచేస్తుంటుంది. అక్కడ నరేంద్ర అనే నీచుడు ఆమెను చెరచబోతాడు. ఆమె వాడిని పోలీసులకు అప్పచెబుతుంది. వాడు జైలుకు వెళతాడు. ఇదంత జరిగి ఆలస్యం కావడంతో సుశీల ఇంటికి వెళుతుంది. ఆమె మేనత్త అనుమానించి, ఇంట్లోంచి గెంటేస్తుంది. నిలువ నీడలేని ఆమెకు రావుబహదూర్ ప్రకాశం, ఆయన భార్య పార్వతి ఆశ్రయమిస్తారు. అక్కడ రఘును చూస్తుంది. అతను వారి అబ్బాయే అని తెలుసుకుంటుంది. రఘు ఆమెను బ్రతిమలాడి రహస్యంగా పెళ్ళి చేసుకుంటాడు. కన్నవారి కన్నుగప్పి కాపురమూ చేస్తాడు. రఘు పై చదువులకు విదేశాలకు వెళతాడు. ఆ సమయంలో జైలు నుండి విడుదలై వచ్చిన నరేంద్ర, సుశీల తన భార్య అని అబద్ధం చెప్పి, రచ్చ చేస్తాడు. నిజమే అనుకొని నచ్చచెప్పి వాడితో పంపిస్తారు. అయితే సుశీల తప్పించుకుంటుంది. రఘు విదేశాల నుండి వచ్చాక తల్లిదండ్రులకు నిజం చెబుతాడు. భార్యను వెదుకుతూ ఉంటాడు. ఈ సమయంలోనే సుశీల ఓ బాబుకు జన్మనిచ్చి, రఘు స్నేహితుడు వెంకట్, అతని భార్య డాక్టర్ కరుణ దగ్గరకు పిల్లవాడిని చేరుస్తుంది. చావాలని ప్రయత్నిస్తుంది. అదే సమయంలో అనాథ శరణాలయంలో ఉండే శాంతమ్మ రక్షించి తనతో తీసుకువెళ్తుంది. అక్కడే పనీపాట చేసుకుంటూ ఉంటుంది సుశీల. అక్కడికీ నరేంద్ర చేరతాడు. అక్కడ ఉండే రంగ అనే వ్యక్తి వాడిని తన్నిపంపుతాడు. కాలం గిర్రున తిరుగుతుంది. రఘు, సుశీల తనయుడు వేణు కూడా తండ్రిలాగే లాయర్ అవుతాడు. నరేంద్ర మరోమారు సుశీలను బలాత్కారం చేయబోగా, రంగ కత్తి విసరగా వాడు చస్తాడు. ఆ నేరం సుశీలపై పడుతుంది. భార్యను కలుసుకున్న రఘు ఆమె తరపున వాదిస్తాడు. ప్రాసిక్యూటర్ అయిన వేణు ఆమెనే దోషిగా నిరూపిస్తాడు. అదే సమయంలో సుశీల తన తల్లి అన్న విషయం వేణుకు తెలుస్తుంది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. ఆ సమయంలో రంగ వచ్చి కోర్టులో అసలు విషయం చెబుతాడు. సుశీల నిర్దోషిగా విడుదలవుతుంది. భర్త, కొడుకును కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
రఘుగా యన్టీఆర్, సుశీలగా అంజలీదేవి, నరేంద్రగా రాజనాల, వేణుగా చలం నటించిన ఈ చిత్రంలో రేలంగి, గుమ్మడి, అమర్ నాథ్, కన్నాంబ, గిరిజ, ఛాయాదేవి, సూర్యకాంతం, సుజాత, మిక్కిలినేని, సత్యనారాయణ,రాజబాబు, కాకరాల తదితరులు నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత రాజశ్రీ అసిస్టెంట్ రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ సినిమాకు సముద్రాల జూనియర్ మాటలు రాయగా, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, సి.నారాయణరెడ్డి, రాజశ్రీ పాటలు రాశారు. పెండ్యాల స్వరకల్పన చేశారు. దర్శకుడు మానాపురం అప్పారావు కథ,స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇందులోని “ఆ మబ్బు తెరలలోనా…” అంటూ సాగే పాట ఆనందంగానూ, విచారంగానూ రెండు రకాలుగా రూపొందింది. “ప్రభూ గిరిధారీ…”, “విను విను…”, “ఎలా ఎలా జీవితం…”, “కనులుండీ చూడలేను…” అంటూ సాగే పాటలు సైతం అలరించాయి. రిపీట్ రన్స్ లో ‘పరువు-ప్రతిష్ఠ’ మంచి ఆదరణ చూరగొంది.