NTV Telugu Site icon

Venu Swamy : వేణు స్వామీ… ఓసారి జాతకం చూపించుకోండి..!!

Venu Swamy Astrologer

Venu Swamy Astrologer

సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవడికి వాడు తోపులనుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు వాగేయడం.. అందులో ఏదైనా ఒకటి నిజమైతే దాన్ని క్లెయిమ్ చేసుకోవడం.. దోచుకోడవం.. ఇదీ పరిస్థితి. ఇలాంటి వాళ్లకు సోషల్ మీడియాలో కొదువేలేదు. ఇలాంటి వాళ్లలో ముందుంటారు జ్యోతిష్యుడిగా చెప్పుకునే వేణు స్వామి (Venu Swamy Parankusam).

వేణు స్వామి జ్యోతిష్యం ఎన్నో సార్లు ఫెయిలైంది. నేను చెప్పింది తప్పయిపోయింది.. క్షమించండి.. ఇంకెప్పుడూ జ్యోతిష్యం చెప్పను అని దండం పెట్టి వెళ్లిపోయారు. కానీ లోపల ఉన్న పబ్లిసిటీ పిచ్చి కామ్ గా ఉంచదు కదా.. సమయం చూసుకుని మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంటారు.. ఇప్పుడు కూడా అలాగే వచ్చేశారు..  చైతూ (Naga Chaitanya), శోభిత (Sobitha Dhulipalla) ఎంగేజ్‌మెంట్ అయింది కదా… పెళ్లి అవుతుంది కానీ.. వాళ్లు మూడేళ్లే కలిసి ఉంటారట. 2027లో ఓ స్త్రీ కారణంగా వీళ్లిద్దరూ విడిపోతారట. జోతిష్య బీభత్స.. వేణుస్వామి చెప్తున్న మాట ఇది. ఎంగేజ్‌మెంట్ ఇలా అయిందో లేదో.. అలా పంచె కట్టుకొని కెమెరా ముందుకొచ్చి.. ఊపుకుంటూ.. ఊగిపోతూ.. జాతకాలు చెప్పేశారు వేణుస్వామి.

తాను జాతకం (Horoscope) చెప్పకపోతే.. వాళ్ల జీవితానికి అర్థం లేదు అన్నట్లు.. అనౌన్స్‌మెంట్ ఇచ్చి మరీ జాతకం చెప్పారీ జోతిష్య రత్నం (Astrologer). అసలు జాతకం చెప్పమని ఈయన్ని ఎవరు అడిగారో.. ఎందుకొచ్చారో.. శోభిత, సమంతను ఎందుకు పోల్చారో.. చివర్లో ఎందుకు వార్నింగ్ ఇచ్చారో.. వేణుస్వామికే తెలియాలి. శుభం పలకరా పెళ్లికొడకా అంటే.. అదేదో అన్నాడని సామెత. అలాంటిది కంటి చూపుతో గ్రహాలను పక్కకు జరిపి పెళ్లిళ్లు చేస్తానని డబ్బా కొట్టుకునే వేణుస్వామికి.. శుభం పలకడం రాదేమోననే సందేహం కలుగుతోంది. ఎవరైనా సరే కొత్తగా జీవితం మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు.. పెద్దమనిషి అనేవాళ్లు దీవిస్తారు.. చల్లగా బతకాలని కోరుకుంటారు. వేణుస్వామి మాత్రం.. విడిపోతారు.. రాసిపెట్టుకోండని చెప్తారు.

పోనీ స్వామి కాని ఈ వేణుస్వామి చెప్పేవన్నీ నిజం అవుతాయా అంటే.. అదేదో హఠాత్‌పరిణామం అన్నట్లు.. వందలో ఒకటో రెండో నిజం అవుతాయ్ అంతే! సమంత (Samantha), నాగచైతన్య విడిపోతారని ముందే చెప్పాను అంటూ.. ఏ ఇంటర్వ్యూలో కనిపించినా ఇప్పటికీ అదే చెప్తుంటారు. అదేదో బెస్ట్ ట్రాక్ రికార్డ్ అయినట్లు ! వేణుస్వామి చెప్పింది జరిగింది అంటే.. అదొక్కటే. మిగతా చాలా విషయాల్లో ఈయన చెప్పిందంతా తుస్సే అయింది.

వేణు స్వామి నోటి నుంచి మంచి మాటే రాదా అనే అనుమానం కూడా కలుగుతుంటుంది. వరుణ్ (Varun), లావణ్య (Lavanya Tripathi) విడిపోతారు అంటారోసారి.. ప్రభాస్ (Prabhas) పని అయిపోయిందంటారు ఇంకోసారి.. కేటీఆర్‌ (KTR) జైలుకు వెళ్తాడన్నారు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కప్ కొడుతుంది అన్నారు.. ఇలా సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని.. చెత్త జాతకాలు చెప్తూ.. పబ్బం గడిపేస్తున్నారు వేణుస్వామి. ఈయనకు గ్రహాల మూమెంట్ తెలుసు.. భవిష్యత్‌ను మూడో కంటితో చూస్తారని భ్రమపడి.. అమాయకత్వంతో ఈయన మాటలు నమ్మి.. లక్షలు, కోట్లలో బెట్టింగ్‌లు వేసి.. రోడ్డున పడ్డ వాళ్లు ఎందరో!

ఎన్నికల ముంగిట వేణుస్వామి రెండు మూడు ఎంపిక చేసుకున్న యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అక్కడ ఆయన విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. జగన్ కు (YS Jagan) తిరుగులేదు. మే తర్వాత బాక్సులు బద్దలైపోతాయ్.. చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan Kalyan) పరిస్థితి బాలేదు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో..! తెలంగాణలో కేసీఆర్ కు తిరుగులేదన్నారు.. రేవంత్ (Revanth Reddy) జాతకం అస్సలు బాగాలేదన్నారు.. ఏపీలో మళ్లీ జగన్‌దే అధికారం అన్నారు.. చంద్రబాబు, పవన్‌కు గెలిచే సీన్ లేదని.. ఈకలా తీసేశారు. కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వేణు స్వామి జాతకంలో డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఆయన ఎంపిక చేసుకున్న చానళ్లకే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారో.. వాటి వెనక ఎవరున్నారో అర్థమైపోయింది. దీంతో ఆయన్ను సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేశారు. తనను అందరూ ట్రోల్ చేస్తున్నారని.. ఇక రాజకీయ నేతలు (Politicians), సెలబ్రిటీల (Celebrities) జాతకాలు, జోతిష్యాల జోలికి వెళ్లనని చేతులెత్తేశారు..

కానీ మాట మీద నిలబడితే ఆయన వేణు స్వామి (Venu Swamy) ఎందుకవుతారు..? నెలలు తిరగకముందే.. మళ్లీ రచ్చ స్టార్ట్ చేశారు. చైతూ, శోభిత పెళ్లి పెటాకులు అవుతుందని.. అవాకులు పేలడం మొదలుపెట్టారు. ఏపీలో జగన్ ఓడిపోయాక జాతకాలు చెప్పడం ఆపేస్తా అన్నారు వేణుస్వామి.. ఆ పని చేసి ఉంటే బాగుండేది! నోరు మూసుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు.. మళ్లీ నోరు తెరుస్తా.. ఇష్టం వచ్చింది వాగుతా అంటే.. రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా నీ సోది జాతకాలు, అర్థం లేని జాతకాలు ఆపేయ్‌. నమ్మకాలు క్రియేట్ చేసి.. వాటితో బిజినెస్‌ చేయడం కూడా ఆపెయ్‌. శుభం పలకడం నేర్చుకో.. శుభాన్ని కోరుకోవడం తెలుసుకో.. అదే నీకు మంచిది.. మనకూ మంచిది అంటూ బాధితులు మెసేజ్‌లు పెడుతున్నారు సోషల్‌ మీడియాలో! నోటికి వచ్చింది వాగడం.. మార్కెటింగ్ చేసుకోవడం.. క్లయింట్‌లను పెంచుకోవడం.. విస్కీ బాటిళ్లతో పూజలు చేయించడం.. ఇదీ వేణుస్వామికి తెలిసిన విద్య. పబ్బులకు, క్లబ్బులకు పోయే ఈయన.. జాతకాలు చెప్పడం ఏంటో.. వాటిని నమ్మి ఈయనతో పూజలు చేయించుకోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి.

నిజానికి వేణుస్వామిని చూసి మిగిలిన జ్యోతిష్యులందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పినవి జరగకపోయినా వాటిని కవర్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో (Social Media) ఉండడం వేణుస్వామి స్పెషాలిటీ. పైగా సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా ప్రమోషన్ ఒకటి. జ్యోతిష్యానికి మన దేశంలో విశేష గుర్తింపు ఉంది. దాన్ని ఒక శాస్త్రంగా గుర్తించింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని వేలాది ఏళ్ల క్రితమే గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా సూర్యచంద్రోదయాలను, కాలచక్రాన్ని, గ్రహణాలను అంచనా వేశారు. ఇప్పటికీ ఎంతోమంది జ్యోతిష్యులు భవిష్యత్తును కచ్చితత్వంతో అంచనా వేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ వేణుస్వామి లాంటి వాళ్లు మాత్రం జ్యోతిష్యంపై నమ్మకాన్నే కోల్పోయేలా దాన్ని దిగజారుస్తున్నారు. ఇలాంటి వాళ్ల వల్ల జ్యోతిష్యానికే మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని సాటి జ్యోతిష్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

జ్యోతిష్యం పేరుతో పిచ్చి వాగుడు వాగే వేణు స్వామి.. అప్పుడప్పుడు తనను ట్రోల్ (Troll) చేస్తున్నారంటూ మారాం చేస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం తాను అప్పుడు అలా చెప్పానని.. కానీ అది తప్పైపోయిందని ఒప్పేసుకుంటారు. తప్పయితే అది జ్యోతిష్యం ఎందుకవుతుంది వేణు స్వామి గారూ..? మీరు జ్యోతిష్యుడు ఎలా అవుతారు..? మరి ఇందుకే కదా మిమ్మల్ని ట్రోల్ చేసేది..!! ఇలాంటి ట్రోల్స్ కోసమే కదా మీ పాకులాట..!! మీ పిచ్చికి జ్యోతిష్యాన్ని వాడుకోకండి.. దాని విశిష్టతను మీరు పూర్తిగా దిగజార్చేస్తున్నారు.. మిగిలిన జ్యోతిష్యులను తలెత్తుకోకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు జ్యోతిష్యుడని.. మీరు చెప్పేది జ్యోతిష్యం అని చెప్పడం మానుకోండి. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా పేరు మార్చేసుకుని.. మీకు ఇష్టం వచ్చినట్లు వాగేయండి..!! చివరగా ఒకమాట… ఎందుకైనా మంచిది మీ జాతకాన్ని ఒకసారి చూపించుకోండి..!! మీ జాతకం అస్సలు బాలేనట్టుంది..!!

Show comments