(ఆగస్టు 2న దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు)
సరిగమలతో సావాసం, పదనిసలతో ప్రయాణం – బాల్యం నుంచీ దేవిశ్రీ ప్రసాద్ కు తెలిసిన విద్య ఇదే. ఆ పయనంలో నుండి మధురం పంచుతూ జనానికి ఆనందం కలిగిస్తూ ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఇరవై ఏళ్ళ ప్రాయంలోనే దేవి సినిమాకు స్వరకల్పన చేసి, ఆ మూవీ టైటిల్ నే తన పేరు ముందు పెట్టుకొని జైత్రయాత్ర ఆరంభించారు దేవిశ్రీ ప్రసాద్. అప్పటి నుంచీ ఇప్పటి దాకా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ప్రేక్షకులను మురిపిస్తూనే ఉన్నాయి. ఇరవై రెండేళ్ళుగా దేవిశ్రీ ప్రసాద్ స్వరయాత్రలో జనం మదిని దోచిన అమృతగుళికలు ఎన్నో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు చిందేయని సినిమా హీరోల అభిమానులంటూ ఎవరూ లేరనే చెప్పాలి. టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాలకూ తన సంగీతంతో మరపురాని మధురాన్ని పంచారు దేవిశ్రీ. అందుకే ఆయన బాణీలతో ఓ సినిమా వస్తోందంటే చాలు అభిమానులు ఆశగా, ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. వారి ఎదురుచూపులకు ఆనందం కలిగించేలా దేవిశ్రీ స్వరకల్పన సాగుతూనే ఉంది. ఇప్పటి దాకా దేవిశ్రీ స్వరకల్పనకు నంది అవార్డును సంపాదించిపెట్టిన చిత్రం అత్తారింటికి దారేది అనే చెప్పాలి. అతను అందుకున్న ప్రభుత్వ అవార్డుల కన్నా మిన్నగా ప్రేక్షకుల రివార్డులు మాత్రం లభిస్తూనే ఉన్నాయి. ఇరవై ఏళ్ళ సంగీత ప్రస్థానంలో దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో దాదాపు వంద చిత్రాలు జనం ముందు నిలిచాయి. వాటిలో అధికశాతం ప్రేక్షకుల మదిని గెలిచాయి.
ప్రముఖ సినిమా రచయిత సత్యమూర్తి తనయుడే దేవిశ్రీ ప్రసాద్. బాల్యం నుంచీ దేవిశ్రీ ప్రసాద్ కు సంగీతం అంటే ప్రాణం. తనయునిలోని ప్రతిభను గమనించిన సత్యమూర్తి సైతం ఎంతగానో ప్రోత్సహించారు. దాంతో టీనేజ్ లోనే దేవిశ్రీ బాణీలు కట్టడం నేర్చారు. బాలమేధావిగానూ జేజేలు అందుకున్నారు దేవిశ్రీ. కొందరు సంగీత దర్శకులు సైతం దేవిశ్రీని ప్రోత్సహించారు. డాన్స్ పార్టీ అనే స్టూడియో ఆల్బమ్ లోని ఎనిమిది పాటల్లో ఓ పాటకు దేవిశ్రీ స్వరకల్పన చేశారు. అలా తొలిసారి తన బాణీలను లోకానికి పరిచయం చేసిన దేవిశ్రీకి ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు, దర్శకుడు కోడి రామకృష్ణ తమ కాంబోలో వచ్చిన దేవి చిత్రం ద్వారా తొలి అవకాశం కల్పించారు. ఆ సినిమాతోనే దేవిశ్రీ ప్రసాద్ తనదైన బాణీ పలికించారు. అతనిలోని ప్రతిభను గుర్తించిన శ్రీను వైట్ల తన ఆనందం చిత్రానికి దేవిని సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. ఆ చిత్రంలోని పాటలతోనూ జనాన్ని ఆకట్టుకున్నారు దేవిశ్రీ.
టాప్ హీరోస్ చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని అందరూ భావిస్తారు. కానీ, తన దరికి చేరిన ప్రతీ చిత్రానికీ స్వరకల్పనతో అలరించాలనే ఆయన భావిస్తూ ఉంటారు. అందుకోసం అహర్నిశలూ శ్రమిస్తూ ఉంటారు. ఇప్పటికీ ప్రతి చిత్రాన్ని తన తొలి సినిమాగా భావించే దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతూ ఉండడం విశేషం. అందుకే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కోసం నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరోస్ ఆరాట పడుతూ ఉంటారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో జనాన్ని చిందేయించడం ఓ ప్రధాన ఆకర్షణ. ఇక ఆయన గాత్రం సైతం ప్రేక్షకులను రంజింప చేస్తూనే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గానంతో ఉర్రూతలూగించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సంగీతజైత్రయాత్రతో టాప్ స్టార్స్ సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.
చిరంజీవి రాజకీయ ప్రవేశం చేయడానికి ముందు వచ్చిన శంకర్ దాదా జిందాబాద్కు తరువాత ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 కి కూడా దేవిశ్రీ బాణీలు కట్టడం విశేషం. ఖైదీ నంబర్ 150 చిత్రంలోని పాటలు ఆబాలగోపాలాన్నీ ఎంతగానో అలరించాయి. ఇక బాలకృష్ణ లెజెండ్ చిత్రంలో హీ ఈజ్ ద లెజెండ్… పాటతో యావత్ తెలుగునేలను ఓ ఊపు ఊపేశారు. దక్షిణ భారతంలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా లెజెండ్ నిలచింది. ఇక మహేశ్ శ్రీమంతుడుకు దేవి స్వరకల్పనలో రూపొందిన పాటలు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభాస్ మిర్చిలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసిన మ్యాజిక్ ను ఎవరూ మరచిపోలేరు. జూ.యన్టీఆర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్లోని పాటలు, నవతరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ ను ఆర్యతో స్టార్ హీరోగా నిలపడంలోనూ, రామ్ చరణ్ రంగస్థలంలో చిందేయడంలోనూ దేవిశ్రీ ప్రసాద్ బాణీలే బాసటగా నిలిచాయి. పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలలో దేవిశ్రీ ప్రసాద్ పలికించిన బాణీలను ఎవరు మాత్రం మరచిపోగలరు? ఈ టాప్ హిట్స్ తోనే కాదు ఇతర యంగ్ హీరోస్ చిత్రాలకూ దేవిశ్రీ ప్రసాద్ పలుమార్లు పసందైన సంగీతం అందించారు. అందుకే స్టార్ హీరోస్ అందరూ ఈ నాటికీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అభిమానిస్తున్నారు. అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్పతో మరోమారు తన మ్యాజిక్ చూపించే ప్రయత్నంలో ఉన్నారు దేవిశ్రీ. ఈ పుట్టినరోజు తరువాత దేవిశ్రీ ప్రసాద్ మరింత మధురాన్ని పంచుతూ జనాన్ని మురిపిస్తారని ఆశిద్దాం.