NTV Telugu Site icon

న‌వ‌లా నాయ‌కుడు చిరంజీవి

Chiranjeevi

తెలుగు చిత్ర‌సీమ‌లో న‌వ‌లానాయ‌కుడు అన్న పేరుతో మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సుప్ర‌సిద్ధులు. ఆయ‌న త‌రువాత ఆ స్థాయిలో న‌వ‌లాచిత్రాల‌తో విజ‌యం సాధించింది చిరంజీవి అనే చెప్పాలి. అక్కినేని ల‌వ్ స్టోరీస్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో రూపొందిన న‌వ‌ల‌ల ఆధారంగా తెర‌కెక్కిన చిత్రాల‌లో న‌టించారు. అయితే చిరంజీవి కోస‌మే అన్న‌ట్టుగా కొన్ని న‌వ‌ల‌లు యాక్ష‌న్ ను కూడా జోడించాయి. స‌ద‌రు న‌వ‌ల‌ల ద్వారా చిరంజీవి న‌టునిగా మంచిపేరు సంపాదించారు. చివ‌ర‌కు మెగాస్టార్ గా జ‌నం మ‌దిలో నిలిచారు. ఆయ‌న న‌టించిన తొలి న‌వ‌లా చిత్రం ‘న్యాయం కావాలి’. డి.కామేశ్వ‌రి రాసిన ‘కొత్త‌మ‌లుపు’ న‌వ‌ల ఆధారంగా రూపొందిన చిత్రం ‘న్యాయం కావాలి’. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇందులో చిరంజీవి తొలుత నెగ‌టివ్ షేడ్స్ తో ఉన్న కేరెక్ట‌ర్ లో న‌టించినా, న‌టునిగా ఆయ‌న‌కు మంచిమార్కులు సంపాదించి పెట్టిందీ చిత్రం. చిరంజీవి, ఎ.కోదండ‌రామిరెడ్డి కాంబినేష‌న్ లో రూపొందిన తొలి చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. ఆ త‌రువాత వారిద్ద‌రి కాంబోలో అనేక న‌వ‌ల‌లు చిత్రాలుగా తెర‌కెక్కి జ‌నాన్ని విశేషంగా అల‌రించాయి.

యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ రాసిన ‘అభిలాష‌’ న‌వ‌ల ఆధారంగా అదే పేరుతో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం మంచి విజ‌యం సాధించింది. న‌వ‌ల‌గా అభిలాష పాఠ‌కుల‌ను విశేషంగా అల‌రించింది. ఈ చిత్రానికి కూడా కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహించారు. చిరంజీవితో కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రాల‌న్నీ న‌వ‌లల ఆధారంగా రూపొందిన‌వే కావ‌డం విశేషం. ‘అభిలాష’ త‌రువాత ‘డ‌బ్బు టు ది ప‌వ‌రాఫ్ డ‌బ్బు’ ఆధారంగా ‘ఛాలెంజ్’ చిత్రం చిరంజీవి, యండ‌మూరి, కోదండ‌రామిరెడ్డి, కె.ఎస్.రామారావు, ఇళ‌యరాజా కాంబినేష‌న‌లో తెర‌కెక్కి మ‌రింత విజ‌యం సాధించింది. ఆ త‌రువాత ఇదే కాంబోలో రూపొందిన ‘రాక్ష‌సుడు’ న‌వ‌ల అదే పేరుతో చిత్రంగా జ‌నం ముందు నిల‌చి ఘ‌న‌విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత ఈ కాంబినేష‌న్ ‘మ‌ర‌ణ‌మృదంగం’ న‌వ‌ల‌ను అదే పేరుతో సినిమాగా రూపొందించి అల‌రించింది. చిరంజీవి హీరోగా యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌నే రాసిన ‘స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్’ న‌వ‌లను అదే టైటిల్ తో సినిమాగా తెర‌కెక్కించారు కె.ఎస్.రామారావు. ఈ చిత్రం ప‌రాజ‌యం పాల‌యింది.

చిరంజీవి, కోదండ‌రామిరెడ్డి కాంబినేష‌న్ లో ‘గూండా’ అనే చిత్రం విశేషాద‌ర‌ణ చూర‌గొంది. ఈ చిత్రానికి గిరిజ‌శ్రీ భ‌గ‌వాన్ రాసిన ‘అబ్బాయి తిరిగొచ్చాడు’ న‌వ‌ల ఆధారం. యండ‌మూరి రాసిన ‘ర‌క్త‌సిందూరం’ న‌వ‌ల ఆధారంగా అదే పేరుతో చిరంజీవి హీరోగా సినిమా తెర‌కెక్కింది. మ‌ల్లాది వెంక‌ట‌కృష్ణ‌మూర్తి రాసిన ‘చంట‌బ్బాయ్’ న‌వ‌ల ఆధారంగా అదే పేరుతో జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రంలో చిరంజీవి కామెడీ భ‌లేగా పండించారు. యండ‌మూరి రాసిన ‘రుద్ర‌నేత్ర‌’ న‌వ‌ల కూడా అదే పేరుతో తెర‌కెక్కింది. ఈ చిత్రానికి కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇలా త‌న త‌రం హీరోల‌తో పోలిస్తే అంద‌రికంటే ఎక్కువ న‌వ‌లాచిత్రాల‌లో న‌టించిన ఘ‌న‌త చిరంజీవికే ద‌క్కింది.

ఆ రోజుల్లో ఎంతోమంది న‌వ‌లార‌చ‌యిత‌లు చిరంజీవిని దృష్టిలో పెట్టుకొనే త‌మ క‌థ‌ల‌ను రూపొందించేవారు. అలా కూడా కొంత‌మంది పేరున్న ర‌చ‌యిత‌ల క‌థ‌ల‌తో చిరంజీవి చిత్రాలు రూపొందాయి. అయితే అవేవీ న‌వ‌ల‌లుగా వెలుగు చూడ‌లేదు. చిత్ర‌మేమిటంటే చిరంజీవి ‘స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్’ అట్ట‌ర్ ఫ్లాప్ త‌రువాత ఆయ‌న మ‌ళ్ళీ న‌వ‌ల‌ల వైపు చూడ‌లేదు. ఆ త‌రువాత నుంచీ రీమేక్స్ పై క‌న్నేశారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ‘ఘ‌రానామొగుడు’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్కింది. ఆ త‌రువాత కొన్ని రీమేక్స్ లో న‌టించినా అవేవీ అంత‌గా అల‌రించ‌లేక పోయాయి. ‘రిక్షావోడు’ అప‌జ‌యం త‌రువాత ఓ యేడాది గ్యాప్ తీసుకొని మ‌రీ న‌టించారు చిరంజీవి. ఆ స‌మ‌యంలోనూ ఆయ‌న రీ ఎంట్రీ మూవీగా ‘హిట్ల‌ర్’ అనే రీమేక్ ను ఎంచుకోవ‌డం విశేషం. రాజ‌కీయాల్లో చేరాక‌, సినిమాల‌కు దూరంగా జ‌రిగిన చిరంజీవి, మ‌రోమారు కెమెరా ముందుకు వ‌చ్చేట‌ప్పుడు కూడా రీమేక్ ‘ఖైదీ నంబ‌ర్ 150’ని ఎంచుకున్నారు. ఇప్పుడు మ‌రోమారు ‘లూసిఫ‌ర్’ రీమేక్ లో న‌టిస్తున్నారు. ఒక‌ప్పుడు తెలుగు ర‌చ‌యిత‌ల‌కు క‌థానాయ‌కునిగా స్ఫూర్తినిచ్చిన చిరంజీవి, ఇప్పుడు రీమేక్స్ బాట ప‌ట్ట‌డం తెలుగు సాహితీ ప్రియుల‌కు విచారం క‌లిగిస్తున్న మాట వాస్త‌వ‌మే. ఆయ‌నే కాదు చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం రీమేక్స్ పై మ‌న‌సు పారేసుకోవ‌డం చూస్తోంటే, ఈ సోద‌రుల‌కు తెలుగునాట క్రియేటివ్ రైట‌ర్స్ పై న‌మ్మ‌కం త‌గ్గిందా అనిపిస్తోంది. లేదా ఇన్ స్టెంట్ స్టోరీస్ లో న‌టిస్తే త‌మ‌కూ విజ‌యం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నారేమో. అలాగ‌ని అన్ని సార్లూ వీరికీ రీమేక్స్ అచ్చిరాలేద‌న్న విష‌యాన్ని మ‌ర‌వ‌రాదు.

ఏది ఏమైనా ఒక‌ప్పుడు న‌వ‌లానాయ‌కునిగా వెలుగు చూసిన చిరంజీవి మ‌ళ్ళీ మ‌న తెలుగు ర‌చ‌యిత‌ల‌ను ప్రోత్స‌హిస్తూ మ‌న‌వాళ్లు త‌యారు చేసిన క‌థ‌ల్లో న‌టిస్తార‌ని ఆశిద్దాం.