(అక్టోబర్ 17న కీర్తి సురేశ్ పుట్టినరోజు)
నవతరం నాయిక కీర్తి సురేశ్ పేరు వినగానే ‘మహానటి’ ముందుగా గుర్తుకు వస్తుంది. తెలుగు సినిమా రంగంలోనే పలు వెలుగులు విరజిమ్మిన కీర్తి సురేశ్ కీర్తి కిరీటంలో ‘మహానటి’ చిత్రం ఓ మేలిమి రత్నంగా వెలసింది. జాతీయ స్థాయిలో కీర్తి సురేశ్ ను ఉత్తమనటిగా నిలిపిన ‘మహానటి’ని జనం మరచిపోలేరు. ఆ సినిమా తరువాత నుంచీ సంప్రదాయబద్ధంగా సాగుతోంది కీర్తి.
కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక అప్పట్లో చిరంజీవి ‘పున్నమినాగు’లో నాయికగా నటించారు. కీర్తి సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు. మేనక, సురేశ్ కుమార్ దంపతులకు 1992 అక్టోబర్ 17న కీర్తి సురేశ్ జన్మించింది. చెన్నైలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ లో పట్టా పుచ్చుకుంది కీర్తి సురేశ్. ఆమెకు వయోలిన్ వాయించడంలోనూ ప్రావీణ్యం ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ లో సీరియస్ గా సాగాలనుకుంది కీర్తి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో “పైలట్స్, అచనేయనేనిక్కిష్టమ్, కుబేరన్”వంటి మళయాళ చిత్రాలలో బాలనటిగా నటించింది. ప్రియదర్శన్ తెరకెక్కించిన ‘గీతాంజలి’ అనే హారర్ ఫిలిమ్ లో ద్విపాత్రాభినయం చేస్తూ నాయికగా పరిచయమైంది కీర్తి. తెలుగులో ‘నేను శైలజ’లో రామ్ సరసన నటించి, ఇట్టే తెలుగువారిని ఆకట్టుకుంది. నానితో కలసి ‘నేను లోకల్’లో ముద్దుగా మురిపించింది. ‘అజ్ఞాతవాసి’లో పవన్ కళ్యాణ్ తోనూ నటించింది. ఇక సావిత్రి జీవితగాథగా తెరకెక్కిన ‘మహానటి’లో జీవించేసింది కీర్తి. అందువల్లే ఆ యేడాది అత్యుత్తమనటిగా జాతీయ స్థాయిలో నిలచింది. ‘మన్మథుడు-2’లో ప్రత్యేక పాత్రలో కనిపించింది కీర్తి. “పెంగ్విన్, మిస్ ఇండియా” వంటి ఓటీటీ మూవీస్ లోనూ కీర్తి అభినయం ఆకట్టుకుంది. ‘జాతిరత్నాలు’లో కాసేపే కనిపించినా, కవ్వించింది. ‘రంగ్ దే’లో నితిన్ తో జోడీ కట్టింది.
కీర్తి సురేశ్ నటించిన కొన్ని పరభాషా చిత్రాలు సైతం తెలుగులోకి అనువాదమై అలరించాయి. ప్రస్తుతం మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది కీర్తి సురేశ్. ‘గుడ్ లక్ సఖీ’ అనే చిత్రంలోనూ, ‘భోళా శంకర్’లోనూ కీర్తి సురేశ్ కనిపించనుంది. తన దరికి చేరిన ప్రతీపాత్రనూ అంగీకరించకుండా, మనసుకు నచ్చిన రోల్స్ ను ఎంపిక చేసుకొని సాగుతోంది కీర్తి. రాబోయే చిత్రాలలో కీర్తి సురేశ్ ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.