(ఆగస్టు 18న గుల్జార్ పుట్టినరోజు)
సంస్కృత ప్రభావం నుండి తెలుగు భాష తప్పించుకోలేనట్టే, ఉర్దూ పదాలు లేకుండా హిందీ శోభించదు. ఈ విషయం తెలిసిన వారు ఉర్దూను అందంగా, హిందీ సాహిత్యంలో చొప్పించేవారు. అలా ఎందరో హిందీ చిత్ర గీతరచయితలు సాగారు. వారిలో గుల్జార్ బాణీ ప్రత్యేకమైనది. కేవలం పాటలతోనే కాదు, మాటలతోనూ మురిపించిన ఘనుడు గుల్జార్. కథకునిగానూ కట్టపడేశారు. దర్శకత్వంతోనూ మురిపించారు. అంతలా అలరించిన గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. గుల్జార్ అన్నది ఆయన కలం పేరు. ఆ పేరుతోనే దేశవ్యాప్తంగా సాహిత్యాభిమానులను మురిపించారు. సాహిత్యంతో ఆస్కార్ అవార్డును అందుకున్న తొలి భారతీయునిగా చరిత్రలో నిలిచారు గుల్జార్. ఎ.ఆర్. రహమాన్ బాణీల్లో రూపొందిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’లో గుల్జార్ రాసిన ‘జై హో…’ గీతం ప్రపంచ వ్యాప్తంగా సంగీతప్రియులను ఎంతగానో అలరించింది. ఈ పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ గుల్జార్ సొంతమయింది. ఇక గుల్జార్ కలం నుండి జాలువారిన పాటలు ఐదు నేషనల్ అవార్డ్స్, 22 ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. దర్శకునిగానూ గుల్జార్ బాణీ అనితరసాధ్యమనిపిస్తుంది.
‘మేరే అప్నే’ అనే చిత్రంతో గుల్జార్ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకునిగా నిలిచారు. “అచానక్, పరిచయ్, కోషిష్, ఆందీ, ఖుష్బూ, మౌసమ్, కినారా, కితాబ్, మీరా, సహీరా, చత్రన్, అంగూర్, నమ్కీన్, ఇజ్జత్, లిబాన్, లేకిన్” వంటి చిత్రాలతో దర్శకునిగానూ తన బాణీని పలికించారు గుల్జార్. “మాచిస్, హు తు తు” సినిమాలతో నవతరం ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు గుల్జార్. అనేకమంది సంగీత దర్శకులు, ప్రఖ్యాత దర్శకులు గుల్జార్ పాటలతోనే సాగాలని పరితపించేవారు. వారికి నచ్చిన రీతిలో పాటలు రాసి, జనాన్నీ ఆనందింప చేశారు గుల్జార్. పద్మభూషణ్ అవార్డును అందుకున్నారాయన. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం గుల్జార్ కీర్తి కిరీటంలో నిలచింది.
ఆ నాటి అందాల నటి రాఖీని వివాహమాడారు గుల్జార్. వారి కూతురు మేఘన. కొన్ని కారణాల వల్ల గుల్జార్, రాఖీ విడిపోయారు. అయితే కూతురు మేఘన భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని వారు విడాకులు తీసుకోలేదు. మేఘనా గుల్జార్ సైతం తండ్రి బాటలోనే పయనిస్తూ దర్శకురాలిగా మారారు. ఆమె “ఫిల్హాల్, తల్వార్, రాజీ, ఛపాక్” వంటి చిత్రాలతో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నారు. ఇప్పటికీ తన దరి చేరిన అవకాశాల్లో సాహితీవిలువలు వీడకుండా వీనులకు ఆనందం పంచే పాటలు రాస్తున్నారు గుల్జార్. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.