NTV Telugu Site icon

40 Years for Bangaru Kanuka : నలభై ఏళ్ళ ‘బంగారు కానుక’

Bangaru Kanuka

Bangaru Kanuka

(ఏప్రిల్ 2తో ‘బంగారు కానుక’కు 40 ఏళ్ళు)
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా నటించిన చిత్రాలలో ఎవర్ గ్రీన్ అంటే ‘ప్రేమాభిషేకం’ చిత్రమే! ఆ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత ఏయన్నార్, శ్రీదేవి కాంబోలో మరికొన్ని చిత్రాలు వెలుగు చూశాయి. అయితే అవేవీ ‘ప్రేమాభిషేకం’ స్థాయిలో అలరించలేక పోయాయి. ‘ప్రేమాభిషేకం’ తరువాత ఏయన్నార్, శ్రీదేవి నటించిన చిత్రాలు వచ్చాయి. కానీ, వాటిలో వారిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమకానుక’. ఆ సినిమా తరువాత వచ్చిన చిత్రం ‘బంగారు కానుక’. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ వి.మధుసూదనరావు దర్శకత్వం వహించడంతో సినిమాపై విడుదలకు ముందు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 1982 ఏప్రిల్ 2న ‘బంగారు కానుక’ విడుదలయింది.

‘బంగారు కానుక’ కథ ఏమిటంటే- రమేశ్ తండ్రి ఓ కోటీశ్వరుడు. రమేశ్ కు, తన మేనకోడలు శాంతికి పెళ్ళి చేయాలనుకుంటాడు. కానీ, రమేశ్ కాలేజ్ లో రూప అనే అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. ఆమెనే పెళ్ళాడతానని శాంతితో కూడా చెబుతాడు. ఆమె కూడా ఆనందంగా అంగీకరిస్తుంది. అయితే, రూప ఆ తరువాత కనిపించకుండా పోతుంది. రమేశ్ పిచ్చివాడవుతాడు. అతనికి శాంతి సపర్యలు చేస్తూ ఉంటుంది. శాంతికి పెళ్ళి సంబంధం వస్తుంది. అప్పుడు ఆమె రమేశ్ కు సాన్నిహిత్యంగా ఉండడంతో అనుమానాలు వస్తాయి. అది తెలిసిన రమేశ్ తన వల్ల శాంతి జీవితం పాడు కాకూడదని ఆమెనే పెళ్ళాడతాడు. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతూ ఉంటుంది. వారికి ఓ పాప. ఆమెను స్కూల్ లో చేర్పిస్తారు. అక్కడ ఆ పాపకు టీచర్ గా రూప వస్తుంది. ఆమెను చూసిన తరువాత రమేశ్ మనసు అల్లకల్లోలానికి గురవుతుంది. దాంతో రమేశ్, శాంతి మధ్య కలతలు. శాంతికి అసలు విషయం తెలిసి ప్రాణత్యాగం చేయాలనకుంటుంది. రూప వచ్చి రక్షిస్తుంది. తాను ఎందువల్ల రమేశ్ జీవితం నుండి తప్పుకున్నది చెబుతుంది. తనకు సర్వస్వం అయిన అన్నావదినలు మరణించడంతో వారి పిల్లల బాధ్యత తీసుకోవలసి వచ్చిందని, అందువల్లే తాను పెళ్ళి చేసుకోకూడదని భావించానని చెబుతుంది. రమేశ్, శాంతను కలిపి రూప నిష్క్రమించడంతో కథ ముగుస్తుంది.

రవీంద్ర ఫిలిమ్స్ పతాకంపై రావుల అంకయ్య గౌడ్ నిర్మించిన ‘బంగారు కానుక’ చిత్రంలో ఏయన్నార్, శ్రీదేవి, సుజాత, గుమ్మడి, అ్లల్లు రామలింగయ్య, రంగనాథ్, అన్నపూర్ణ, కృష్ణవేణి తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ మాటలు రాయగా, వేటూరి, ఆత్రేయ పాటలు పలికించారు. సంగీతం సత్యం సమకూర్చారు. ఇందులోని “నడకా…హంసధ్వనిరాగమా…”, “మందారాలే వికసించె…”, “నోచిన నోముకు వరమూ…”, “ఏమిటోగా ఉంది… యెదలో రొదలా…”, “తామరపువ్వంటి తమ్ముడు కావాలా…” వంటి పాటలు అలరించాయి. పాటలు మినహాయిస్తే, ఈ సినిమా అంతగా అలరించలేక పోయింది.