ఓ సూపర్ స్టార్ సినిమా టైటిల్, వర్ధమాన కథానాయకులతో తెరకెక్కిన చిత్రం పేరు ఒకేలా ఉంటే ఎవరికి లాభం? నిస్సందేహంగా టాప్ స్టార్ మూవీకి ఉన్న క్రేజ్, చిన్న తారల సినిమాకు ఉండదు. కానీ, 1991లో చిరంజీవి ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ సినిమా విడుదలైన సమయంలోనే భానుచందర్ హీరోగా తెరకెక్కిన ‘స్టూవర్ట్ పురం దొంగలు’ అనే చిత్రం వెలుగు చూసింది. టైటిల్స్ ఒకేలా ఉండడంతో జనం కాస్త కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే! అయితే బాగున్న సినిమాకే జనం జై కొడతారు అనడంలో ఏ లాంటి సందేహం లేదంటూ చిరంజీవి సినిమాను పక్కన పెట్టి ‘స్టూవర్ట్ పురం దొంగలు’నే ఆదరించారు. దాంతో ఆ చిత్ర దర్శకుడు సాగర్ పేరు ఒక్కసారిగా జనం నోళ్ళలో నానడం మొదలయింది. ఆ తరువాత జనం మెచ్చే మరికొన్ని చిత్రాలూ రూపొందించారాయన. సాగర్ వద్ద శిష్యరికం చేసిన శ్రీను వైట్ల, వి.వి.వినాయక్, రవికుమార్ చౌదరి వంటి దర్శకులు సైతం ఆ తరువాతి రోజుల్లో చిత్రసీమలో రాణించారు.
సాగర్ అసలు పేరు విద్యాసాగర్ రెడ్డి. 1952 మార్చి 1న గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నిడమర్రులో జన్మించారు. ఆయన తండ్రి నాగిరెడ్డి వారి ఊరికి మునుసబు. కన్నడ నాట దర్శకునిగా రాణించిన విజయ్ రెడ్డి, తెలుగు చిత్రసీమలో ఎడిటర్ గా పేరు గాంచిన వి.నాగిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ వి.శ్రీనివాసరెడ్డి సాగర్ సోదరులు. చిన్నతనం నుంచీ సాగర్ కు దూకుడు ఎక్కువ. యన్టీఆర్ సినిమాలంటే ఎంతో అభిమానం. తమ ఊరిలో కాకపోతే, మంగళగిరికో, లేకపోతే గుంటూరుకో వెళ్ళి సినిమాలు చూసివచ్చేవారు సాగర్. వారిది సంపన్న కుటుంబం కావడంతో పిల్లల చదువు మద్రాసులో సాగితే బాగుంటుందని సాగర్ తండ్రి భావించారు. దాంతో సాగర్ తో పాటు ఆయన సోదరులు, సోదరీమణులు కూడా మద్రాసు చేరి అక్కడే విద్యాభ్యాసం సాగించారు. మద్రాసు కేసరి హైస్కూల్ లో సాగర్ చదివారు. వీరికి అల్లు అరవింద్ సీనియర్. సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉన్న సాగర్, ఆయన సోదరులు సినిమారంగం ఉన్న మద్రాసులోనే చదువుకోవడం వల్ల ఎలాగైనా చిత్రసీమలో ప్రవేశించాలన్న అభిలాష కలిగింది. వారి ఊరిలో ఒకతను ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ ఉండేవారు. అతడితో సాగర్ తల్లి ఓ సారి, “మావాడిని కూడా నీతో పాటు తీసుకువెళ్ళి ఆ ఎడిటింగ్ ఏదో నేర్పించరాదూ…” అని కోరింది. దానికి, ఆ వ్యక్తి “మీ అబ్బాయి లాంటి దూకుడు మనిషి సినిమారంగంలో పనికి రాడు.ఇక్కడ రాణించాలంటే ఓర్పు, సహనం ఉండాలి…” అని అన్నాడట. ఆ మాటలే సాగర్ లో పట్టుదల పెంచాయి. ఎలాగైనా సినిమారంగంలో రాణించాలనుకొని తానూ ఎడిటర్ అనిపించుకోవాలని ప్రయత్నాలు సాగించారు. తన మిత్రుని సహకారంతో మధు పిక్చర్స్ అధినేత మల్లికార్జున రావు సోదరుడు శ్రీహరి నిర్మిస్తోన్న ‘ఇంటిగౌరవం’ చిత్రానికి ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో చేరారు సాగర్. అలా చిత్రసీమలో తొలి అడుగువేసిన సాగర్ ఉత్సాహంగా రోజుకు 18 గంటలు పనిచేస్తూ సాగారు. ఆ సినిమా మధ్యంతరంగా ఆగిపోయింది. తరువాత బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహ్మద్ బీన్ తుగ్లక్’కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పయనం ఆరంభించారు. ఆ పై ప్రసాద్, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి వంటి దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేశాక, హీరో కృష్ణను దృష్టిలో పెట్టుకొని ఓ కథను తయారుచేసి, ఆయనకు వినిపించారు. కృష్ణ అప్పట్లో బిజీగా ఉన్న కారణంగా వెంటనే వీలు కాలేదు. ఈ విషయం తెలిసిన విఠల్ అనే నిర్మాత ఈ లోగా తనకు ఓ సినిమా చేసి పెట్టమని అడిగారు. అదే నరేశ్, విజయశాంతి జంటగా రూపొందిన ‘రాకాసిలోయ’. ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ఆకట్టుకుంది. ఆ తరువాతే సుమన్, భానుచందర్ తో ‘డాకు’ తెరకెక్కించారు. మంచి పేరు సంపాదించారు సాగర్. ఈ సినిమాలతో సాగర్ యాక్షన్ మూవీస్ బాగా తీస్తారనే పేరు సంపాదించారు. కానీ, ఆయనకు మరింత పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగలు’ అనే చెప్పాలి.
కృష్ణ హీరోగా సాగర్ తెరకెక్కించిన ‘అమ్మదొంగ’ మంచి విజయం సాధించింది. ఆ తరువాత సుమన్ తో రూపొందించిన ‘ఓసి నా మరదలా, రామసక్కనోడు’ సైతం అలరించాయి. సాగర్ దర్శకత్వంలో రూపొందిన “నక్షత్ర పోరాటం, జగదేకవీరుడు, అన్వేషణ, అమ్మా… అమ్మని చూడాలని ఉంది, దాడి, పైసా పరమాత్మ, పబ్లిక్ రౌడీ, చారుశీల, యాక్షన్ నంబర్ వన్, ఖైదీ బ్రదర్స్” వంటి చిత్రాలలోనూ యాక్షన్ తో అలరించారు. కృష్ణ, సుమన్, భానుచందర్, రవితేజ వంటి హీరోలతో సాగర్ తెరకెక్కించిన ఈ సినిమాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. నేటి మేటి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సోదరులతో చివరలో ఆయన తెరకెక్కించిన “యాక్షన్ నంబర్ వన్, ఖైదీ బ్రదర్స్” ఫైట్స్ తో సాగాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆశల పల్లెకి’ అనే చిత్రంలో బాలలు ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా అప్పట్లో ఉత్తమ బాలల చిత్రంగా నిలచింది. అలాగే సాగర్ చిత్రాల ద్వారా పలువురు నటీనటులకూ నందీ అవార్డులు లభించడం విశేషం! తరువాతి రోజుల్లో సాగర్ వద్ద పనిచేసిన దర్శకులు రాణించారు. సాగర్ మునుపటిలా ఆకట్టుకొనే చిత్రాలు తెరకెక్కించలేక పోయారు. అయితే చిత్రసీమలోని పలువురు దర్శకులు సాగర్ ను గురువుగా గౌరవించేవారు. కొంతకాలం దర్శకుల సంఘానికి అధ్యక్షునిగానూ ఆయన పనిచేశారు. సాగర్ సోదరులు కూడా చిత్రసీమలోనే రాణించడం విశేషం! అందరినీ నవ్వుతూ “ఏంటి నాన్నా…బాగున్నావా…” అంటూ పలకరించేవారు సాగర్. బాలకృష్ణ ‘నర్తనశాల’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆయనకు ఛీఫ్ కో-డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సినిమా వెలుగు చూడలేదు. ఈ మధ్య ఏటీటీలో అందులోని బిట్స్ వెలుగు చూశాయి. ఏది ఏమైనా అందరితోనూ మంచివాడు అనిపించుకున్న సాగర్ మరణం, ఆయన సన్నిహితులను, శిష్యులను దుఃఖసాగరంలో ముంచిందనే చెప్పాలి.