(సెప్టెంబర్ 5తో బొంబాయి ప్రియుడుకు 25 ఏళ్ళు)
ఆల్ కూర చమ్ చమ్ అనే పదాన్ని జంధ్యాల జనానికి యన్టీఆర్ అడవిరాముడుతో పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు ఆ సినిమాలో కొంత, ఈ సినిమాలో కొంత తీసుకొని తెరకెక్కించారు. అందువల్లే ఆల్ కూడ చమ్ చమ్ అన్న మాటను జంధ్యాల తమపై తామే సెటైరిక్ గా పలికించారేమో అనిపిస్తుంది. అయితే అడవిరాముడు అఖండ విజయం సాధించిన సెంటిమెంట్ తో కాబోలు కె.రాఘవేంద్రరావు అనేక పర్యాయాలు తన చిత్రాలను ఆల్ కూర చమ్ చమ్లాగే రూపొందించారు. అలాంటి వాటిలో జె.డి.చక్రవర్తి, రంభ జంటగా రాఘవేంద్రుడు తెరకెక్కించిన బొంబాయి ప్రియుడు ఒకటని చెప్పక తప్పదు. బొంబాయి ప్రియుడులో కథను ఎత్తుకోగానే పలు చిత్రాలు మనకు గుర్తుకు వస్తుంటాయి. ఇక ద్వితీయార్ధమయితే తమిళ చిత్రం ఉల్లతై అల్లితై తప్పకుండా స్ఫురిస్తుంది. అలా రూపొందిన బొంబాయి ప్రియుడు చిత్రం 1996 సెప్టెంబర్ 5న విడుదలయింది. ఈ చిత్రానికి ముందు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన పెళ్ళిసందడి చిత్రం రికార్డుబ్రేక్ హిట్ గా నిలచింది. ఆ ఉత్సాహంతోనే రాఘవేంద్రరావు, అప్పట్లో మరో యంగ్ హీరోగా రాజ్యమేలుతున్న జె.డి.చక్రవర్తి హీరోగా ఈ బొంబాయి ప్రియుడును రూపొందించారు. ఆర్.కె. పిలిమ్ అసోసియేట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రాఘవేంద్రుని అన్న కె.కృష్ణమోహనరావు నిర్మించారు.
కథ విషయానికి వస్తే- పెళ్లిసందడిలో లాగే ఇందులో పెద్దగా కథేమీ ఉండదు. ఓ పెద్దింటి అమ్మాయిని, బొంబాయిలో ఫోటోగ్రాఫర్ గా పనిచేసే అబ్బాయి ప్రేమిస్తాడు. అసలు వారిద్దరి పరిచయమే ఓ దొంగ కొట్టేసిన గొలుసు, ఆ అమ్మాయి బ్యాగ్ తో మొదలవుతుంది. ఆ తరువాత ఆ గొప్పింటి అమ్మాయి తల్లిని ఈ ఫోటోగ్రాఫర్, అతని మిత్రులు, ఆ దొంగ ఎలా ప్రసన్నం చేసుకున్నారు అన్నది మిగిలిన కథ. ఇందులోని సన్నివేశాలన్నీ కొన్ని హిందీ చిత్రాలను గుర్తు చేస్తాయి. ఉల్లతై అల్లితైనీ ఇట్టే పట్టించేస్తాయి. చిత్రమేమిటంటే ఈ చిత్రాన్ని హిందీలో మై తేరే ప్యార్ మే పాగల్ గానూ, తమిళంలో బాంబే కాదలి పేరుతో అనువదించారు.
ఇందులో వాణిశ్రీ హీరోయిన్ తల్లిగా నటించగా, మిగిలిన పాత్రల్లో సుధాకర్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఏవీయస్, బాబూమోహన్, శివాజీరాజా, గుండు హనుమంతరావు, చిట్టిబాబు, బెనర్జీ, ఎమ్. బాలయ్య నటించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. పెళ్ళిసందడిలాగే ఈ చిత్రాన్ని కూడా మ్యూజికల్ హిట్ గా నిలిపారు రాఘవేంద్రరావు. ఇందులోని ఎనిమిది పాటలూ జనాన్ని ఆకట్టుకున్నాయి.ఏమ్ హాయిగుందిరా...బొంబాయి ప్రేమికా...`,చేతిలోన చెయ్యేసి చెప్పేయనా…పాటలను వేటూరి పలికించారు.అహో…ప్రియా…అనే పాటను సీతారామశాస్త్రి రాశారు. మిగిలిన అన్ని పాటలనూ చంద్రబోస్ రచించారు. వాటిలోరాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా…,బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే…,చందనా చీరను కట్టి…,గుప్పెడు గుండెను తడితే…,ప్రణయమా…` పాటలు మురిపించాయి. ఆరంభంలోబొంబాయి ప్రియుడుజనాన్ని విశేషంగా అలరించింది. అయితేపెళ్ళిసందడి` లాగా ఈ సినిమా రన్ లో పరుగు తీయలేకపోయింది.
