NTV Telugu Site icon

SPB : మన తలపుల్లో చెరగని మధురం… ఎస్పీ బాలు!

Spb

Spb

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నోట ఏ మాట పలికినా, అది మధురామృతంగా మారిపోతుందని అందరికీ తెలుసు. సందర్భానుసారంగా తన స్వరాన్ని సవరించుకొనే బాలు నటుల విలక్షణమైన వేషధారణలోనూ అందుకు తగ్గట్టుగా గానం చేసి మురిపించారు. ఇక ఆయనతో పాటు ఇలాంటి పాటల్లో గళం విప్పడానికి సాటి గాయకులు సైతం ఉత్సాహంతో ఉరకలేసి మరీ పాడారు. తెలుగు చిత్రసీమలోని టాప్ స్టార్స్ అందరికీ ఒకప్పుడు ఎస్పీ బాలు గాత్రం తప్ప మరో ఆధారం లేదు. ఇక టాప్ హీరోస్ వరైటీ రోల్స్ లో కనిపించి మురిపించిన సందర్భాల్లోనూ బాలు తనదైన గానంతో ఆకట్టుకున్నారు. ఇక బాలుగళంలో జాలువారిన మధురగీతాలు మనల్ని సందర్భానుసారంగా తట్టిలేపుతూనే ఉంటాయి.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరులో జన్మించారు. బాలు తండ్రి సాంబమూర్తి హరికథలు చెప్పేవారు. అలా బాలుకు చిన్నతనంలోనే తండ్రి నుండి గానం వారసత్వంగా అబ్బింది. అంతే తప్ప అదే పనిగా సాధన చేసి ఎరుగరు. చదువుకొనే రోజుల్లో బాలు పాటల పోటీల్లో పాడేవారు. ఓ సారి అలా పాటల పోటీలో మేటిగా నిలచిన సమయంలో ప్రముఖ గాయని ఎస్.జానకి ‘సినిమాల్లో ట్రై చేయమని’ సూచించారు. తరువాతి రోజుల్లో చిత్రసీమలో బాలు అవకాశాల కోసం వేట ఆరంభించిన సమయంలో ఎస్పీ కోదండపాణి తన స్వరకల్పనలో తెరకెక్కిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’లో గెస్ట్ గా నటించిన శోభన్ బాబుకు బాలుతో పాడించారు. ‘ఆహా…ఏమి… ఈ వింత మోహం…’ అంటూ ఆ పాట సాగుతుంది. తరువాతి రోజుల్లో కృష్ణకు, పలువురు కమెడియన్స్ కు పాటలు పాడుతూ అలరించారు బాలు. ఘంటసాల మరణంతో యన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటివారికి కొంతకాలం రామకృష్ణ పాటలు పాడినా, తరువాత బాలు గాత్రమే వారికీ ఆధారమయింది. స్టార్ హీరోస్ అందరికీ బాలు గళం మ్యాజిక్ చేస్తూ పాటలు పాడి అలరించింది.

నాటి మేటి హీరోలందరికీ బాలు పాటలు సందడి చేశాయి. నటరత్న యన్టీఆర్ అభినయానికి తగ్గట్టుగా పాడి మెప్పించారు. ఇక నటసమ్రాట్ ఏయన్నార్ నటనకూ తగ్గ రీతిలో గానం చేసి మురిపంచారు బాలు. ‘సత్యం-శివం’లో ఈ మహానటులిద్దరికీ కలిపి ఒకే పాటలోనే వైవిధ్యం ప్రదర్శిస్తూ బాలు పాటలు పాడి అలరించారు. యన్టీఆర్ – ఏయన్నార్ తరువాత కృష్ణ – శోభన్ బాబుకు కూడా బాలు గళం దన్నుగా నిలచింది. ఈ హీరోలిద్దరికీ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు బాలు. ఇద్దరికీ కలిపి కూడా బాలు ఒక్కరే పాడి మురిపించడమూ మరచిపోలేం. ఇలా టాప్ స్టార్స్ తో తన సత్తా చాటుకున్న బాలు గానవైభవాన్ని ఎవరు మరచిపోగలరు.

మాతృభాష తెలుగులోనే కాదు అనేక భాషల్లో బాలు గానం అమృతధారలు కురిపించింది. ఏ భాషలో పాడినా, సదరు భాషను అవగాహన చేసుకొని, ఆకళింపు చేసుకొని మరీ బాలు గళం విప్పేవారు. అందుకే బాలు తమవాడంటే తమవాడని తమిళ, కన్నడ సోదరులు సైతం గర్వంగా చెప్పుకొనేవారు. బాలు గానమాధుర్యానికి మొత్తం 18 నంది అవార్డులు లభించగా, నటన, డబ్బింగ్, సంగీతం ద్వారా మరో ఐదు నందులు ఆయన ఇంటికి నడచుకుంటూ వెళ్ళాయి. అలా మొత్తం 23 నంది అవార్డులు సంపాదించి, రికార్డు నెలకొల్పారు బాలు. జాతీయ స్థాయిలో మొత్తం ఆరు సార్లు ఉత్తమ గాయకునిగా నిలిచారు బాలు. ‘శంకరాభరణం’తో తొలి నేషనల్ అవార్డు అందుకున్న బాలు, తరువాత హిందీ చిత్రం ‘ఏక్ దూజే కేలియే’తో రెండో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘సాగరసంగమం, రుద్రవీణ’ చిత్రాలతోనూ, తమిళ సినిమా ‘మిన్సార కనవు’ ద్వారా, కన్నడ చిత్రం ‘సంగీతసాగర గానయోగి పంచాక్షరి గవై’తో బాలుకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి. ఏసుదాస్ తరువాత జాతీయ అవార్డుల్లో మేటిగా నిలిచారు బాలు. ఇక ప్రపంచంలో అత్యధిక గీతాలు పాడిన గాయకునిగా ఎస్పీ బాలు చరిత్ర సృష్టించారు. భారతదేశం అత్యున్నత పురస్కారాల్లో మూడు ‘పద్మ’ అవార్డులనూ అందుకున్నారాయన. 2012 సంవత్సరానికి గాను యన్టీఆర్ నేషనల్ అవార్డుకు బాలు ఎంపికయ్యారు. ఇవి గాక, ఆయన కీర్తి కిరీటంలో ఎన్నెన్నో మేలిమి రత్నాలు ఉన్నాయి.

‘పాడుతా-తీయగా’ వేదిక ద్వారా ఎంతోమంది గాయనీగాయకులను బాలు తీర్చిదిద్దిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు. తనదంతా ‘శ్రుత పాండిత్యం’ అంటూనే నిష్ణాతులైన పండితులు సైతం అబ్బురపడేలా సంగీతసాగరంలోని రత్నాలను ఏర్చికూర్చి భావితరాలకు ఆయన అందించిన సంగీతనిధిని మరువలేము. 2020 సెప్టెంబర్ 25న కరోనా మహమ్మారి మన బాలును బలి తీసుకుంది. ఆయన సదా అభిమానుల తలపుల్లో ఓ మధురంగా మసలుతూనే ఉంటారు. తెలుగుమాట ఉన్నంత వరకు బాలు పాట ఉంటుంది… బాలు పాట ఉన్నంత వరకూ తెలుగుమాటకూ విలువ పెరుగుతూనే ఉంటుంది.