Site icon NTV Telugu

Tollywood: ఇక్కడి హీరోలు అక్కడి దర్శకులు! అక్కడి హీరోలు ఇక్కడి దర్శకులు!!

Movies

Movies

పాన్ ఇండియా ఫీవర్ కారణంగా టాలీవుడ్ లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న, మధ్య తరగతి హీరోలు సైతం తెలుగులో తీసిన సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రాలైతే చాలానే వరుస కట్టాయి. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’, ‘యశోద’ రెండూ పాన్ ఇండియా మూవీసే. వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సినిమాలనూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి.

Read Also : Tollywood: ఇక్కడి హీరోలు అక్కడి దర్శకులు! అక్కడి హీరోలు ఇక్కడి దర్శకులు!!

ఇదిలా ఉంటే… గత యేడాదిగా టాలీవుడ్ లో ద్విభాషా చిత్రాల హడావుడి మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు తీయడం మళ్ళీ మనవాళ్ళు షురూ చేశారు. విశేషం ఏమంటే…. ఇలాంటి ద్విభాషా చిత్రాలను నిర్మిస్తున్న తెలుగు నిర్మాతలు తమిళ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారు. అంటే హీరో మనవాడు. దర్శకుడు తమిళియన్ అన్నమాట. రామ్ హీరోగా శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘ది వారియర్’కు లింగుస్వామి దర్శకుడు. అలానే ఆయనే నాగచైతన్యతో తీయబోతున్న బై-లింగ్వల్ మూవీకి తమిళియన్ వెంకట ప్రభు డైరెక్టర్. చిరంజీవితో సూపర్ గుడ్ సంస్థ నిర్మిస్తున్న ‘గాడ్ ఫాదర్’కు ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా దర్శకుడు. కాగా, విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఓరి దేవుడా’కు తమిళుడైన అశ్వత్ మరిముత్తు డైరెక్టర్. అయితే ఈ సినిమా మాతృకైన ‘ఓ మై కడవులే’కూ అతనే దర్శకుడు. ఇక వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘రంగరంగ వైభవంగా’ మూవీని తమిళ దర్శకుడు గిరీశాయ తెరకెక్కిస్తున్నాడు. అలానే సమంత హీరోయిన్ గా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ‘యశోద’ చిత్రాన్ని తమిళ దర్శక ద్వయం హరి – హరీశ్ రూపొందిస్తున్నారు.

విశేషం ఏమంటే… తెలుగు హీరోలు తమిళ దర్శకుల చిత్రాలలో ఎలాగైతే నటిస్తున్నారో… అలానే పరభాషా కథానాయకులూ తెలుగు దర్శకుల ప్రతిభకు ఫిదా అయ్యి, పలు తెలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాంటి పలు ప్రాజెక్ట్స్ ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. మలయాళ స్టార్‌ హీరో దుల్కర్ సల్మాన్ ‘లెఫ్టినెంట్ రామ్’ (వర్కింగ్ టైటిల్) మూవీని హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ ఈ మధ్యే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీని ప్రారంభించాడు. దీన్ని ‘దిల్’ రాజుతో కలిసి పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. మరో కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ అయితే ఏకంగా ఇద్దరు తెలుగు దర్శకులతో మూవీస్ చేయడానికి సై అనేశాడు. అందులో ‘సర్’ మూవీకి వెంకీ అట్లూరి దర్శకుడు. త్రివిక్రమ్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక మరొకటి శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రం. దీన్ని నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి, శ్రియా జంటగా నటిస్తున్న ‘మ్యూజిక్ స్కూల్’ మూవీని బియ్యాల పాపారావు డైరెక్ట్ చేస్తున్నారు. అలా అక్కడి దర్శకులతో ఇక్కడి హీరోలు, ఇక్కడి దర్శకులతో అక్కడి హీరోలు జుగల్బందీ చేస్తున్నారు.

Exit mobile version