కరోనా ప్యాండమిక్ లో ఎంతోమంది ఆపన్నులను ఆదుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోమారు తన మంచిమనసు చాటుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఎంతోమంది యుద్ధం కారణంగా నిరాశ్రయులైనారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ తనదైన రీతిలో స్పందించారు. తాలిబన్లతో పోరాటం సాగించిన ఆఫ్ఘన్ పట్టణాలలో జనజీవనం అతలాకుతలమైందని, అలాంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని సోనూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే అక్కడ నివాసమున్న ఎంతోమంది భారతీయులు సైతం ప్రస్తుతం నిలువనీడ లేకుండా ఉన్నారని, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వారికి మన అవసరం ఉందని సూచించారు. ప్రపంచంలోని ఇతర దేశాలు నిరాశ్రయులైన ఆఫ్టన్ కుటుంబాలకు తగిన ఉద్యోగాలు ఇచ్చి, వారికి జీవినోపాధి కల్పించాలని సోనూ విన్నవించారు.
మనసున్న మనిషిగా సోనూ సూద్ మన దేశంలో కొందరికి చేతనైన సాయం చేశారు. ఆయన విన్నపాన్ని మన్నించి ఎందరు సహృదయులు ఆఫ్టన్లను ఆదుకోవడానికి స్పందిస్తారో చూడాలి.
