మనసును ఆకట్టుకొనే చిత్రాలను రూపొందించడంలో ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’కు మంచి పేరుంది. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటా బంధాలు, అనుబంధాలు చక్కగా చోటు చేసుకొని ఉంటాయి. అసభ్యత, అశ్లీలానికి ఈ సంస్థ దూరంగా ఉంటూ సంసారపక్షంగా చిత్రాలను నిర్మించింది. ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ సంస్థలో నాగార్జున తొలుత నటించిన చిత్రం ‘నువ్వు వస్తావని’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, అప్పట్లో నాగ్ చిత్రాలలో ఓ మైల్ స్టోన్ గా నిలచింది.
ఆ తరువాత ఈ సంస్థ నిర్మించిన ‘నిన్నే ప్రేమిస్తా’లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు నాగ్. ఆ రెండు సినిమాల తరువాత సూపర్ గుడ్ సంస్థలో నాగార్జున నటించిన చిత్రం ‘స్నేహమంటే ఇదేరా’. ఈ చిత్రంలో నాగార్జున మేనల్లుడు సుమంత్ ఆయనకు స్నేహితునిగా నటించడం విశేషం. వారిద్దరికీ సుధాకర్ ఫ్రెండ్ గా కనిపించారు. సూపర్ గుడ్ సంస్థలో అంతకు ముందు ‘ప్రియమైన నీకు’ వంటి విజయవంతమైన చిత్రం తెరకెక్కించిన బాలశేఖరన్ దర్శకత్వంలో ‘స్నేహమంటే ఇదేరా’ రూపొందింది. మళయాళంలో విజయం సాధించిన ‘ఫ్రెండ్స్’ సినిమా ఆధారంగా ‘స్నేహమంటే ఇదేరా’ తెరకెక్కింది.
‘స్నేహమంటే ఇదేరా’ కథ విషయానికి వస్తే – అరవింద్, చంద్రు, కృష్ణమూర్తి బాల్య మిత్రులు. చంద్రు అనాథ. దాంతో అరవింద్ కన్నవారే అతడినీ చేరదీస్తారు. ఈ ముగ్గురు మిత్రులు చిన్నప్పటి నుంచీ ఒకరంటే ఒకరు ప్రాణంగా సాగుతారు. అరవింద్ చెల్లెలు అమృత చంద్రుపై ప్రేమ పెంచుకుంటుంది. తన స్నేహితుని చెల్లెలిని ప్రేమించడం తప్పని భావిస్తాడు చంద్రు. అందుకు కృష్ణమూర్తి సాయం కోరతాడు.
కృష్ణమూర్తి నచ్చ చెప్పచూస్తాడు. ఓ సారి ముగ్గురు మిత్రులూ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తారు. అక్కడ కృష్ణమూర్తి బంధువు భవానీ శంకర్ వద్ద పనిలో చేరతారు. ఓ ఇంటికి పెయింట్ వేసే పని అప్పగిస్తాడు భవానీ. ఆ భవంతిలో నివసించే పద్మినీ అనే అమ్మాయిని అరవింద్ ప్రేమిస్తాడు. అయితే పద్మినీ బంధువు స్వాతి కూడా అరవింద్ ను ప్రేమిస్తుంది. ఆమె పద్మినీ పేరుతో అరవింద్ కు ఉత్తరాలు రాస్తుంది.
అది నిజమని అరవింద్ నమ్ముతాడు. పద్మినీకి వేరే అబ్బాయితో నిశ్చితార్థం అవుతూ ఉండగా, అరవింద్ ఆపుతాడు. ఆ సమయంలో మిత్రుని పక్షాన నిలచి, పద్మినీని అవమానిస్తాడు చంద్రు. దాంతో పద్మినీ, అరవింద్ ను పెళ్ళాడాలనుకుంటుంది. కేవలం చంద్రుపై పగతీర్చుకోవడానికి ఈ పెళ్ళి చేసుకోవాలని భావిస్తుంది. అరవింద్ బంధువు గౌతమ్ అనేవాడు అమృతను పెళ్ళాడాలని ఆశిస్తాడు.
కానీ, అమృత, చంద్రును ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు గౌతమ్. అరవింద్, చంద్రు మధ్య చిచ్చు పెట్టడానికి చిన్నతనంలో చంద్రు తమ్ముని చావుకు అరవింద్ కారణమని తేలుస్తాడు. దాంతో చంద్రు, అరవింద్ ను అసహ్యించుకుంటాడు. వారిద్దరి మధ్య పోరాటం సాగుతుంది. అరవింద్ లోయలో పడతాడు.
కాపాడబోయిన చంద్రుకు అతని చేయి చిక్కదు. మిలిటరీకి వెళ్ళి మేజర్ అవుతాడు చంద్రు. అతని ఆచూకీ తెలిసి కృష్ణమూర్తి లేఖ రాస్తాడు. అందులో అరవింద్ బతికే ఉన్నాడని, కోమాలో ఉన్నాడని తెలుపుతాడు కృష్ణమూర్తి. అరవింద్ ను చూడటానికి వెళ్తాడు చంద్రు. అక్కడ అరవింద్, పద్మినీ కొడుక్కి తన పేరు చంద్రు అని పెట్టుకున్నారని తెలుసుకుంటాడు. పద్మినీ, అమృతను గౌతమ్ హింసిస్తూంటాడు. అతనికి బుద్ధి చెబుతాడు చంద్రు. ఆ పోట్లాటలో కోమాలో ఉన్న అరవింద్ కు స్పృహ వస్తుంది. చివరకు అరవింద్, పద్మినీ, చంద్రు, అమృత, కృష్ణమూర్తి సంతోషంగా ఉండడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో అరవింద్ గా నాగార్జున, చంద్రుగా సుమంత్, కృష్ణమూర్తిగా సుధాకర్ నటించారు. జూహీ చావ్లా, ప్రత్యూష, అభినయశ్రీ, అలీ, వేణు మాధవ్, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, చలపతిరావు, గిరిబాబు, నర్రా వెంకటేశ్వరరావు, రామిరెడ్డి, శ్రీమాన్, గౌతమ్ రాజు తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ సిద్ధిక్, మాటలు చింతపల్లి రమణ రాశారు. కులశేఖర్, చిర్రావూరి విజయ్ కుమార్, మృత్యుంజయుడు పాటలు రాశారు. ఈ చిత్రానికి శివశంకర్ సంగీతం సమకూర్చారు. ఇందులోని “స్నేహమంటే ఇదేరా…, ,”చెలియా నీ ప్రేమలోనే…”, “కన్నె పిల్లలే…”, “నా పెదవికి సిగ్గులు…”, “నేస్తమా…నేస్తమా…” వంటి పాటలు అలరించాయి. ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంది.