NTV Telugu Site icon

Sivakarthikeyan: విజయ్‌తో శివకార్తికేయన్ మల్టీస్టారర్ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Sivakarthikeyan Vijay Konda

Sivakarthikeyan Vijay Konda

Sivakarthikeyan Wants To Do Multistarrer With Vijay Devarakonda: ఏ హీరో అయినా తన సినిమా ఈవెంట్స్‌లో ఎక్కువగా తన సినిమా గురించే మాట్లాడుతాడు. ఒకవేళ ఎవరైనా గెస్టులుగా వస్తే.. వాళ్లకు థాంక్స్ అని చెప్పి తమ రుణం తీర్చేసుకుంటారు. కానీ.. ఇక్కడ శివకార్తికేయన్ మాత్రం అలా చేయలేదు. తన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తేశాడు. తన చిత్రం గురించి మొదటగా విజయ్ గురించే మాట్లాడాడు. మన భారత చిత్రసీమలోని స్మార్టెస్ట్ హీరోల్లో విజయ్ ఒకడని, అతని గీత గోవిందం సినిమాను తాను చాలాసార్లు చూశానని అన్నాడు. ఆ సినిమాలో విజయ్ చాలా స్వీట్‌గా కనిపించాడని, నిజ జీవితంలో అతను అంతకన్నా స్వీట్ పర్సన్ అని ప్రశంసించాడు. తన కెరీర్ చాలా స్లోగా మెరుగవుతూ వచ్చిందని.. ఒక రైలు ఎలా స్టాపుల్లో ఆగుతూ స్లోగా సాగుతుందో.. తొలుత మీడియాలో, ఆ తర్వాత చిత్రసీమలో క్రమంగా తాను ఎదుగుతూ వచ్చానని తెలిపాడు. కానీ.. విజయ్ దేవరకొండ కెరీర్ మాత్రం అలా కాదని, రాకెట్‌లాగే అనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడని కొనియాడాడు. ఇది మామూలు విషయం కాదని, నిజంగా విజయ్ జర్నీ స్ఫూర్తిదాయకమైనదని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు.. అతని ఫోటోలు చూస్తున్నప్పుడల్లా ‘అసలు ఇంత చార్మింగ్‌గా ఎలా పుట్టేశాడురా బాబు, అందుకేనేమో అమ్మాయిలు ఇతని వెంట పడుతుంటారు’ అంటూ అనుకుంటుంటానని శివకార్తికేయన్ తెలిపాడు. ఈ ఈవెంట్‌లో అతడే ప్రిన్స్‌లా కనిపిస్తున్నాడని పొగడ్తలతో ముంచెత్తాడు. తెలుగులో ట్రైలర్ విడుదల చేయడంతో పాటు ఈ ఈవెంట్‌కి వచ్చి సినిమా స్థాయిని విజయ్ మరింత పెంచాడని పేర్కొన్న శివకార్తికేయన్.. ఇద్దరం కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేద్దామని కోరాడు. అందుకు విజయ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది త్వరలోనే సాధ్యం అవ్వొచ్చని, వేదిక మీదే దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నాడు కాబట్టి, ఆయన తలచుకుంటే పక్కాగా విజయ్, తన కాంబోలో మల్టీస్టారర్ ఉంటుందని చెప్పాడు. అప్పుడు హరీశ్ శంకర్ కూడా మీరు రెడీ అంటే, నేను చేయడానికి సిద్ధమేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి, ఇది కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి. ఒకవేళ నిజంగానే ఈ మల్టీస్టారర్ వస్తే మాత్రం, కచ్ఛితంగా పాన్ ఇండియా స్థాయిలో దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఇక విజయ్, సమంత చేస్తోన్న ‘ఖుషీ’ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశించాడు.

అంతేకాదండోయ్.. గబ్బర్ సింగ్ సినిమా ప్రస్తావనని కూడా శివకార్తికేయన్ ఈ సందర్భంగా తీసుకొచ్చాడు. తమిళనాడులో ఈ చిత్రాన్ని తాను థియేటర్‌లో చూశానని.. దర్శకుడు హరీశ్ శంకర్ చాలా గొప్పగా ఆ సినిమాని రూపొందించారని.. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ అయితే అద్భుతంగా వచ్చిందని కొనియాడాడు. తాను ఏ థియేటర్‌లో ఆ చిత్రాన్ని చూశానో, ఆ థియేటర్ దద్దరిల్లిపోయిందని పేర్కొన్నాడు. ఇక ఈ ఈవెంట్‌కి విచ్చేసినందుకు దర్శకుడు హరీశ్ శంకర్‌కి, విజయ్ దేవరకొండకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

Show comments