Siva Nageswara Rao: ఆయన పెద్దగా నవ్వరు, కానీ, భలేగా నవ్విస్తారు. ఆయన అంతలా నవ్విస్తారని ఎవరైనా చెబితే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అలా సీరియస్ గా కనిపిస్తారు మరి. కానీ, ఒక్కసారి ఆయనతో పరిచయం కలిగితే చాలు మన పొట్టలు చెక్కలు కావలసిందే! అంతలా నవ్విస్తూ ఉంటారు. ఓపిక ఉండాలే కానీ, ఆయన నుండి నిరాటంకంగా నవ్వులు పూయించే హాస్యం పుడుతూనే ఉంటుంది. అలా హాస్యం పండించే ఆ ‘ఫ్యాక్టరీ’ పేరు శివ నాగేశ్వరరావు.
చాలామంది దర్శకులు తమ చిత్రాలలో వైవిధ్యం ప్రదర్శించి జనాన్ని కట్టిపడేయాలని భావిస్తూంటారు. కానీ, శివ నాగేశ్వరరావు వరైటీగా నవ్వించాలనే తపిస్తుంటారు. ఆ తపనతోనే చాలా రోజుల తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టి ‘దోచేవారెవరురా?’ అంటూ ఓ నవ్వుల నావను తయారు చేస్తున్నారు. గతంలో శివనాగేశ్వరరావు రూపొందించిన “మనీ, ఒన్ బై టూ, లక్కీ ఛాన్స్, మనీ మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం, ఓ పనై పోతుంది బాబూ!” వంటి నవ్వుల నావల్లో విహరించి, ఆనందం పొందిన వారు ఆయన తాజా తయారీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య తన దర్శకత్వంలో రూపొందిన ‘నిన్ను కలిశాక’లో తెరపై కూడా కనిపించారు శివనాగేశ్వరరావు. ఆయన నుండి మళ్ళీ బయలు దేరనున్న నవ్వుల నావ ‘దోచేవారెవరురా’లో గీత రచయితగానూ మారారు. ఇందులో ఆయన కలం నుండి జాలువారిన “పిషలే… కిల్లీ…మిల్లీ… కిచ్చా…” అంటూ సాగే పాట ఇప్పటికే యూ ట్యూబ్ లో అలరిస్తోంది. ఇందులోనే “కల్లాసు… అన్నీ వర్రీసు…” అంటూ మరో పాటనూ చొప్పించారు. మరి శివనాగేశ్వర రావు అంతలా మీ ‘వర్రీస్’ అన్నీ మటుమాయమై పోతాయంటూ భరోసా ఇస్తోంటే ఎవరు మాత్రం ‘దోచేవారెవరురా’ కోసం ఆసక్తిగా ఎదురు చూడరు చెప్పండి!? మరి ఏ రోజున ఈ నవ్వుల నావ జనం ముందుకు వస్తుందో? ఎంతమందిని హాస్యసముద్రంలో షికారు చేయిస్తుందో చూడాలి.