చేంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిన రోజు జూన్ 5 1986! ఆ రోజున కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ చిత్రం విడుదలైంది. దానికి ముందు సీతారామశాస్త్రి రాసిన గీతం ఒకటి ‘జననీ జన్మభూమి’ చిత్రంలో ఉన్నా టైటిల్ కార్డ్స్ లో ఆయన పేరు చేంబోలు సీతారామశాస్త్రిగానే పడింది. ఏ ముహూర్తాన ఆయన ‘సిరివెన్నెల’ను ఇంటి పేరుగా మార్చుకున్నారో గానీ జీవిత చరమాంకం వరకూ తన కలం ద్వారా సినీ వనంలో సిరివెన్నెల కురిపిస్తూనే ఉన్నారు. మే 20 సీతారామశాస్త్రి జయంతి. ఆయన కన్నుమూసిన తర్వాత వస్తున్న ఈ జయంతోత్సవాన్నిఓ వేడుకలా జరపడానికి సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. మే 20వ తేదీ సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరుగబోతోంది.
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యంలో మొదటి సంపుటిని (1986-92 సినిమా పాటలు) పుస్తక రూపంలో తీసుకొస్తున్నామని, దీనిని గౌరవ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరిస్తారని సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామశాస్త్రి తెలిపారు. ఆ వేదికపై సీతారామశాస్త్రి పాటల విభావరితో పాటు కొన్ని గీతాలను నృత్యరూపంలో ప్రదర్శించబోతున్నామని, పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారని శ్రీరామశాస్త్రి తెలిపారు.
