సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’ మూవీ శనివారం విడుదలైంది. ఈ రోజు మధ్యాహ్నం సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ‘మొదటి ఆట నుండే చిత్రానికి చక్కని స్పందన వస్తోంద’ని చెప్పారు. ‘ఈ మూవీ స్క్రిప్ట్ చదివినప్పుడే యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని అనిపించిందని, అదే ఈ రోజు నిజమైంద’ని అన్నారు. ‘ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే చిన్న సందేహం తనకు ఉండేదని, అయితే మూవీని చూసిన తన బాబాయ్ చినబాబు గారూ, త్రివిక్రమ్ గారూ సినిమా సక్సెస్ విషయంలో సందేహ పడాల్సిన అవసరమే లేదని భరోసా ఇచ్చార’ని తెలిపారు. చివరకు ‘డీజే టిల్లు’ విషయంలో వారిద్దరి నమ్మకమే నిజమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. సినిమా రన్ టైమ్ తక్కువ కావడంతో ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఉన్నా… నాలుగు ఆటలు ప్రదర్శించేలా ప్లాన్ చేశామని, త్వరలో సక్సెస్ టూర్ కూడా చేయబోతున్నామని నాగవంశీ అన్నారు.
Read Also : Justin Bieber : కాన్సర్ట్ లో కాల్పుల కలకలం… గాయాలు
హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ, ”నా ముందు సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ కరోనా కారణంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్ వే లో రిలీజ్ కావడం, మాస్ ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ప్రధాన కారకులు నిర్మాత నాగవంశీ. అలానే చిన్నబాబు గారూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సైతం మా ప్రతి అడుగులోనూ అండగా ఉన్నారు. త్రివిక్రమ్ గారు సినిమా చూసిన వెంటనే ఏ యే సన్నివేశాలలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చెప్పారు. ఇవాళ థియేటర్ లో సినిమా చూస్తుంటే వారి ఆలోచన ఎంత కరెక్టో అర్థమైంది. ఈ సినిమాకు నేనే మాటలు రాయడం వల్ల వాటిని కెమెరా ముందు అలవోకగా చెప్పాను. అలానే పాత్ర రూపకల్పనలో నా ప్రమేయం కూడా ఉండటంతో దానిని అంత చక్కగా పోషించ గలిగాను. దీనిని వన్ మ్యాన్ షో అని కొందరు అంటున్నారు కానీ ఇది సమష్టి కృషి ఫలితం. మా దర్శకుడు విమల్ కృష్ణ ఎక్కువ మాట్లాడారు బట్ ఆయన మోస్ట్ టాలెంటెడ్ పర్శన్” అని చెప్పారు. గత యేడాది వచ్చిన ‘జాతిరత్నాలు’ మూవీతో దీనిని పోల్చడం ఆనందంగా ఉందని, తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ‘బ్లాక్ బస్టర్ హిట్’ అనే మాట తన సినిమాకు వింటున్నాన’ని సిద్ధు అన్నారు.
దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ, ”యూఎస్ లో ఉన్న మా అమ్మ, నాన్నగార్లు నిన్న రాత్రి సినిమా చూసి ఎంతో ఆనందించారు. నన్ను చూసి గర్వపడుతున్నామని చెప్పారు. అంతకు మించి బెస్ట్ కాంప్లిమెంట్ ఏదీ లేదని నేను అనుకుంటున్నాను. ఉదయం క్రాస్ రోడ్స్ లోని థియేటర్ లో ప్రేక్షకుల స్పందన చూస్తే ఆశ్చర్యం కలిగింది. మేం తీసిన సినిమాకు ఇంత గొప్ప రెస్పాన్స్ వస్తోందా! అనిపించింది. ఈ విజయాన్ని ప్రస్తుతం ఆస్వాదించే పనిలో ఉన్నాను. కాస్తంత స్థిమిత పడిన తర్వాత సీక్వెల్ గురించిన ఆలోచన చేస్తాను” అని అన్నారు. మీడియా సమావేశం అనంతరం సంస్థ కార్యాలయం ముందు విజయోత్సవంలో భాగంగా బాణసంచా కాల్చారు.