Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..

Unaccustomed Earth 300kb

Unaccustomed Earth 300kb

Unaccustomed Earth: సినిమాలతో పాటు ఓటీటీలోనూ తనదైన ముద్ర వేస్తున్న సిద్ధార్థ్ ఇప్పుడు మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’తో నెట్‌ఫ్లిక్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, అదే ప్లాట్‌ఫామ్‌పై మరో ఒరిజినల్ సిరీస్‌లో కనిపించనున్నాడు. ఈసారి మాత్రం యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కాకుండా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా చుట్టూ సాగే కథలో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్‌కు ‘అన్‌కస్టమ్డ్ ఎర్త్’ (Unaccustomed Earth) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో హాలీవుడ్ నటి ఫ్రిధా పింటో సిద్ధార్థ్ కు జోడీగా నటిస్తోంది. ప్రసిద్ధ రచయిత్రి ఝంపా లాహిరి రాసిన అవార్డు విన్నింగ్ నవల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. నిన్ననే (2026 సెప్టెంబర్ 18న) ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ఫస్ట్‌లుక్ విజువల్స్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ‘అన్‌కస్టమ్డ్ ఎర్త్’ 2026 డిసెంబర్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు కూడా ప్రకటించింది.

ఈ సిరీస్‌కు మాధురి శేఖర్ షోరన్నర్‌గా, రచయితగా వ్యవహరిస్తున్నారు. సిద్ధార్థ్ పాత్రతో పాటు ఫ్రిధా పింటో పాత్ర కూడా కథలో కీలకంగా ఉండనుంది. క్యాన్సర్ బారిన పడిన పార్వతి (ఫ్రీదా పింటో) అనే వివాహిత, తన తండ్రి మాట కోసం కాలేజీ రోజుల్లో వదిలేసిన తన మొదటి ప్రేమ అయిన అమిత్ (సిద్ధార్థ్) కోసం తిరిగి అమెరికాకు చేరుకుంటుంది. వారిద్దరి మధ్య మళ్లీ మొదలయ్యే ఒక రహస్యమైన ప్రేమాయణం, కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలను సృష్టించింది అనే ఎమోషనల్ మైండ్ గేమ్‌తో ఈ సోపీ డ్రామా సాగనుంది. ఈ సిరీస్‌లో సిద్ధార్థ్, ఫ్రిధా పింటోలతో పాటు ఇంద్రనీల్ సేన్‌గుప్తా, పర్వీన్ కౌర్, సరయు బ్లూ, జస్టిన్ బర్తా, ఆది రాయ్, ఐలా సుందర్‌సింగ్ మెక్‌కైగ్, జయంత్ కృపలాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’తో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్‌లో ‘అన్‌కస్టమ్డ్ ఎర్త్’తో రాబోతున్నాడు. డిసెంబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో సిద్ధార్థ్ అభిమానులతో పాటు ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల్లోనూ దీనిపై ఇప్పటినుంచే క్యూరియాసిటీ పెరుగుతోంది.