‘పుష్ప’ వెనకే సౌతిండియాలోని నాలుగు భాషల్లో జనం ముందుకు వచ్చిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. హిందీలో ఈ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచన ఉన్న నిర్మాత బోయనపల్లి వెంకట్ ఉత్తరాదిన దీన్ని రిలీజ్ చేయలేదు. కోల్ కత్తా నేపథ్యంలో, పునర్ జన్మ కథాంశంతో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ ఎలా ఉందో తెలుసుకుందాం.
వాసు (నాని) ఓ ఫిల్మ్ మేకర్. డైరెక్టర్ గా మారే ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. ఆ క్రమంలో సైకాలజీ స్టూడెంట్ కీర్తి (కృతిశెట్టి)తో పరిచయం ఏర్పడుతుంది. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ టైమ్ లో వీరిద్దరూ ప్రేమలో పడతారు. అది పూర్తి అయ్యి వాసుకు డైరెక్టర్ గా అవకాశం వచ్చే సమయానికి ఓ చిన్న విషయంలో అతన్ని అపార్థం చేసుకున్న కీర్తి వదిలి వెళ్ళిపోతుంది. వాసు తీసిన మూవీ సక్సెస్ కావడంతో అతనికి బాలీవుడ్ లోనూ ఛాన్స్ లభిస్తుంది. దానికి సంబంధించిన ప్రకటన వెలువడుతున్నప్పుడే కాపీ రైట్ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేస్తారు. మూడున్నర దశాబ్దాల క్రితం శ్యామ్ సింగరాయ్ అనే బెంగాలీ రైటర్ రాసిన రచనలనే వాసు కాపీ కొట్టాడన్నది పబ్లిషింగ్ హౌస్ ఆరోపణ. అసలు తెలుగువాడైన వాసుకు – బెంగాలీ బాబు శ్యామ్ సింగరాయ్ కు ఏమిటీ సంబంధం? బెంగాలీ చదవడమే రాని వాసు ఆ భాషలోని నవలలను ఎలా మక్కీకి మక్కీ దించేశాడు? వాసు సబ్ కాన్షన్స్ లో పలవరించే రోజీ ఎవరు? వీటన్నిటికీ సమాధానం సినిమా సెకండ్ హాఫ్ లో లభిస్తుంది.
సత్యదేవ్ జంగా ఇచ్చిన మూలకథను డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తన విజన్ కు తగ్గట్టుగా విస్తరింప చేసుకున్నాడు. ఇటు హైదరాబాద్, అటు కోల్ కత్తా నేపథ్యంలో ఈ కథను నడిపాడు. పశ్చిమ బెంగాల్ లోని అంటరానితనం, దేవదాసి వ్యవస్థపై శ్యామ్ బాబు చేసే పోరాటాన్ని బాగా హైలైట్ చేశాడు. అయితే ఆ రెండు దురాచారాలను ఇవాళ ఎవరూ అంతగా ఐడెంటిఫై చేసుకునే పరిస్థితుల్లో లేరు. అలానే రచయితగా గొప్ప గుర్తింపు పొందిన శ్యామ్ సింగరాయ్ అర్థాంతరంగా అంతర్థానం కావడం, దానిపై ఏ స్థాయిలోనూ చర్చ జరగకపోవడం, శ్యామ్ బాబుపై అయిన వాళ్లే దాడి చేయడం… ఇలాంటి కీలకమైన సన్నివేశాలను దర్శకుడు చాలా క్యాజువల్ గా పిక్చరైజ్ చేశాడు. దాంతో తెర మీద కనిపించే పాత్రలతో ప్రేక్షకులకు ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడలేదు. ఈ కథను స్క్రీన్ మీదకు ఎక్కించే ప్రయత్నంలో ఎంత సూపర్ నేచురల్ మూవీనే అయినా… చాలా సందర్భాలలో లాజిక్స్ మిస్ అయ్యాడు. శ్యామ్ సింగరాయ్… వాసుగా పునర్ జన్మ ఎత్తడానికి మెయిన్ రీజన్ ఏమిటనేది ఏదీ ఇందులో లేదు. ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం అతను తిరిగి జన్మించాడో అర్థం కాదు. సనాతన ధర్మాన్ని, దేవుడిని విశ్వసించని, కమ్యూనిస్టు భావజాలం ఉన్న శ్యామ్ సింగరాయ్ పునర్ జన్మ ఎత్తడం అనేది చిత్రం!
నటీనటుల విషయానికి వస్తే… నాని ఇటు వాసుగా, అటు శ్యామ్ సింగరాయ్ గా పూర్తి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ను ప్రదర్శించి మెప్పించాడు. మరీ ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ క్యారెక్టర్ లో ఓ లెవెల్లో ఉన్నాడు. తొలిచిత్రం ‘ఉప్పెన’తో తెలుగువారి మనసుల్లో చోటు సంపాదించుకున్న కృతీశెట్టి షార్ట్ ఫిల్మ్ యాక్టర్ గా, సైకాలజీ స్టూడెంట్ గా చలాకీగా నటించింది. ఇందులో కృతితో స్మోక్ చేయించాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్న బ్లాక్ మెయిల్ సీన్ కు ఉపయోగించడం కోసం తప్పితే! ఈ మూవీలో తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చిన వ్యక్తి సాయి పల్లవి. ఆమెలోని డాన్సింగ్ స్కిల్స్ ను డైరెక్టర్ రాహుల్ చక్కగా ఉపయోగించుకున్నాడు.
దేవదాసి పాత్రకు సాయిపల్లవి ప్రాణం పోసింది. నాని, సాయిపల్లవి ఇప్పటికే ‘ఎంసీఎ’ మూవీలో కట్టారు కాబట్టి, ఈ జంటతో ప్రేక్షకులు ఠక్కున కనెక్ట్ అయిపోతారు. వాసు తరఫున కేసు వాదించే లాయర్ గా ‘ప్రేమమ్’ ఫేమ్ మడోన్నా సబాస్టియన్ నటించింది. ఆమెకు అపోనెంట్ లాయర్ గా మురళీశర్మ, జడ్జి గా ‘శుభలేఖ’ సుధాకర్, సైకియాట్రిస్ట్ గా ప్రముఖ నర్తకి లీలా శాంసన్, వాసు స్నేహితుడిగా అభినవ్ గోమటం, శ్యామ్ బాబు అన్నలుగా విషు సేన్ గుప్తా, భూపాల్, రాహుల్ రవీంద్రన్ నటించారు. ఈ యేడాది కోర్టు నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఆరేడు వరకూ ఉన్నాయి. అదే జాబితాలోనే ఇదీ చేరుతుంది. అలానే పునర్ జన్మల నేపథ్యంలోనూ కొన్ని సినిమాలు రాబోతున్నాయి. వాటికి ఇది నాంది అనుకోవాలి.
నిర్మాత వెంకట్ బోయనపల్లి ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని నిర్మించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కె.కె. రాసిన పాటలు అర్థవంతంగా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ బాణీలకంటే నేపథ్య సంగీతం బాగుంది. కోల్ కత్తా ఎట్మాస్ ఫియర్ ను అవినాష్ కొల్లు బాగానే రీక్రియేట్ చేశారు. దానిని సాను జాన్ వర్గీస్ చక్కగా కాప్చర్ చేశారు. సమ్ థింగ్ స్పెషల్ మూవీ చూస్తామనుకున్న ప్రేక్షకుల ఆశలపై కథ, కథనాలలో దమ్ములేకపోవడం, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు లేకపోవడం నీళ్ళు చల్లినట్టు అయ్యింది.
ప్లస్ పాయింట్స్
నాని, సాయిపల్లవి నటన
ప్రొడక్షన్ వాల్యూస్
నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథనం
ఊహకందే క్లయిమాక్స్
రేటింగ్: 2.5 / 5
ట్యాగ్ లైన్: సూపర్ నేచురల్ డ్రామా!