సినీ ప్రపంచంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న నటి శ్రుతి హాసన్. కమల్ లాంటి స్టార్ డాటర్ అయినప్పటికీ కూడా తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాష తో సంబంధం లేకుండా వరుస స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ చివరగా “కూలీ” సినిమా తో మంచి హిట్ అందుకోగా. అదేకాలంలో, విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న “ట్రైన్” చిత్రం ద్వారా త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెరపై తన యాక్టింగ్‌తో మాయ చేస్తూనే, వాస్తవ జీవితంలో తన నిజాయతీ మాటలతో కూడా శ్రుతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని నిజాలను, తండ్రి కమల్ హాసన్ నుంచి నేర్చుకున్న విషయాలను మరియు తన వ్యక్తిగత నిర్ణయాలపై వచ్చిన విమర్శలను గురించి మాట్లాడింది.
Also Read : Kantara Chapter 1 : రిషబ్ శెట్టి ‘కాంతార 1’ ఓటీటీ రిలీజ్‌పై క్లూ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్!
శ్రుతి మాట్లాడుతూ “నేను కమల్ హాసన్ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం. ఆయన నటన, ఆలోచనలు నాపై సహజంగానే ప్రభావం చూపాయి. చాలామంది నా నటనను ఆయనతో పోలుస్తుంటారు, కానీ నేను దాన్ని ఒత్తిడిగా తీసుకోను. నా జీవితంలో ఆయన ఎప్పుడూ నాకు స్పూర్తిగా నిలిచారు. ఆయన వద్ద నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం.. ఎంత ఎదిగినా మనిషి వినయం కోల్పోవద్దు. మా నాన్న బాక్సాఫీస్ నంబర్ల గురించి ఎప్పుడూ ఆలోచించరు. ఆయనకు కళ, కంటెంట్ ముఖ్యమైనవి. డబ్బు కంటే కథ చెప్పే తపన ఎక్కువగా ఉంటుంది” అని తెలిపింది. అలాగే తనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ.. “నేను కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్న విషయం గురించి బహిరంగంగా మాట్లాడాను. కానీ అందుకు కొందరు ‘ఈమె ప్లాస్టిక్ సర్జరీల దుకాణం’ అంటూ కామెంట్లు చేశారు. నేను చేసినది నా వ్యక్తిగత నిర్ణయం. నిజాయతీగా ఉంటే సమాజం మీపై వేలెత్తి చూపుతుంది, కానీ నేను భయపడను. నేను ఎప్పుడూ నిజంగా, నాకిష్టమైన విధంగా జీవిస్తాను. ప్రేమలోనైనా, పనిలోనైనా అబద్ధపు ఆమోదం కంటే నిజాయతీనే నాకు ప్రాధాన్యం” అని చెప్పింది.
ఇక దక్షిణాది, బాలీవుడ్ ఇండస్ట్రీల మధ్య తేడాలపై మాట్లాడుతూ.. “దక్షిణాదిలో నటులు చాలా వినయంగా, గౌరవంగా ఉంటారు. సినిమా ప్రారంభంలో పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం వంటి సంప్రదాయాలు ఇప్పటికీ పాటిస్తారు. మొదట ఈ విషయాలు నాకు కొత్తగా అనిపించాయి, కానీ తర్వాత వాటి వెనుక ఉన్న గౌరవాన్ని అర్థం చేసుకున్నాను. దక్షిణాదిలో స్టార్ హీరోలు కూడా సాదాసీదా జీవితం గడుపుతారు. వారు విలాసవంతమైన వస్తువుల ద్వారా తమ విజయాన్ని చూపించుకోవాలని అనుకోరు. అయితే బాలీవుడ్‌లో ఆ ఆడంబరం ఎక్కువగా కనిపిస్తుంది” అని చెప్పింది ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
